భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో పరారైంది: అతను చేసిన దారుణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

జాలౌన్: ఉత్తరప్రదేశ్‌లోని జాలౌన్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత అయిన తన ప్రేమికురాలిని హతమార్చినందుకు ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియురాలు తనతో కలిసి ఉండాలని నిరంతరం ఒత్తిడి చేయడంతో, ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

నిజానికి ఆ ప్రియుడు, సదరు మహిళను మరియు ఆమె ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో, చివరకు ఆమెను పొట్టనబెట్టుకున్నాడు.

అసలేం జరిగింది? జూన్ 7న ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌లో ఉన్న భీమ్‌తాల్ సరస్సులో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అది జాలౌన్‌కు చెందిన పుష్ప తివారీ (30)గా గుర్తించారు. ఈ సమాచారాన్ని నైనితాల్ పోలీసులు, జాలౌన్ పోలీసులకు తెలియజేశారు. అప్పటి నుండి నిందితుడి కోసం గాలింపు మొదలైంది. తాజాగా ఈ కేసులో హంతకుడు అభిషేక్ శ్రీవాస్తవను పోలీసులు అరెస్టు చేశారు.

జాలౌన్‌లోని డకోర్ గ్రామానికి చెందిన పుష్ప తివారీకి 2016లో రిషి తివారితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె బీఎస్సీ చదువుతుండగా, పిల్లల కోసం చదువు ఆపేసింది. అదే గ్రామానికి చెందిన అభిషేక్ (32) ఆమె పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత అభిషేక్‌కు ఢిల్లీలో ఉద్యోగం వచ్చినా, ఊరికి వచ్చినప్పుడల్లా పుష్పను కలిసేవాడు. వీరిద్దరి మధ్య రెండేళ్లుగా సంబంధం కొనసాగుతున్నా, పుష్ప భర్తకు ఆ విషయం తెలియలేదు.

హంతకుడు చెప్పిన కథనం: పోలీసుల విచారణలో అభిషేక్ మాట్లాడుతూ, “పుష్ప పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వెళ్లే క్రమంలో మా మధ్య పరిచయం పెరిగింది. ఆమె నాతో కలిసి జీవించాలని, తనతో పాటు వచ్చేయాలని నిరంతరం ఒత్తిడి చేసేది. నేను అందుకు ఇష్టపడలేదు, అందుకే ఆమెను చంపేయాలని ప్లాన్ చేశాను” అని తెలిపాడు.

ప్లాన్ ప్రకారం మే 27న ఆమెను ఢిల్లీ పిలిపించాడు. మే 30న ఆమెను ఉత్తరాఖండ్ తీసుకెళ్లి, హోటల్ గదిలో మద్యం తాగించాడు. అనంతరం భీమ్‌తాల్ సరస్సు దగ్గరకు తీసుకెళ్లి, ఆమె మత్తులో ఉన్న సమయంలో మెట్లపై నుండి సరస్సులోకి తోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఢిల్లీకి తిరిగి వచ్చేశాడు.

పోలీసుల చర్య: డకోర్ నివాసి రిషి తివారీ తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. భార్య మృతదేహం లభించాక, భర్త అనుమానం వ్యక్తం చేస్తూ అభిషేక్ పేరుతో ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం వెతికినా దొరకకపోవడంతో, ఎస్పీ అభిషేక్‌పై రూ. 25 వేల రివార్డు ప్రకటించారు. చివరికి జూలై 8న విశ్వసనీయ సమాచారంతో అభిషేక్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.


Posted

in

by

Tags: