బెళగావి: బెళగావి జిల్లా రామదుర్గంలో భర్త ఇంట్లోనే లక్షలాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించిన ఆరోపణలపై భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు, దొంగిలించిన నగలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
బెళగావి జిల్లా రామదుర్గం తాలూకా హోసకోటి గ్రామంలో భర్త ఇంట్లో దొంగతనం చేసిన ఆరోపణలపై భార్య హసీనా నదాఫ్, ఆమె ప్రియుడు హనుమంత్ మారాపూర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.
అసలేం జరిగింది?
మూడలగి తాలూకాకు చెందిన హసీనా నదాఫ్కు రెండు నెలల క్రితమే హోసకోటి గ్రామానికి చెందిన షరీఫ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన తర్వాత కూడా హనుమంత్ మారాపూర్తో హసీనా సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే అతడితో కలిసి ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
హోసకోటి గ్రామానికి చెందిన షరీఫ్ ఇంట్లో 154.6 గ్రాముల బరువున్న (సుమారు ₹21 లక్షల విలువైన) బంగారు ఆభరణాలు మరియు 45 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై దిల్షాన్ నదాఫ్ కటకోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రామదుర్గం సీపీఐ వినాయక బడిగేర మరియు పీఎస్ఐ బసవరాజ్ కొణ్ణూరె నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి, కేసు నమోదైన 48 గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. వారి నుంచి చోరీకి గురైన నగలను రికవరీ చేశారు. కేసును వేగంగా ఛేదించిన రామదుర్గం పోలీసులను జిల్లా ఎస్పీ కె. రామరాజన్ అభినందించారు.
