మీరు బెంగళూరులో లేదా కర్ణాటకలోని ఏ ప్రాంతంలోనైనా ఒక రౌండ్ వేస్తే, పైన కనిపిస్తున్న ఫోటో మీకు తరచుగా కనిపిస్తుంది. కేవలం బెంగళూరు మాత్రమే కాదు, కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, హోటళ్లు, కిరాణా షాపులు ఇలా ఏ కట్టడానికైనా ఈ మహిళ ఫోటో దర్శనమిస్తుంది.
ముఖ్యంగా కొత్తగా కడుతున్న ఇళ్లపై ఈ ఫోటో తప్పనిసరిగా ఉంటుంది. ఇది చూడగానే ఎవరి దృష్టి అయినా దాని వైపు వెళ్తుంది. ప్రజలు దీనిని ఒక ‘దృష్టి బొమ్మ’ (Evil Eye Protector) గా విరివిగా ఉపయోగిస్తున్నారు. నుదుటిపై కుంకుమ పెట్టుకుని, ఎవరినో భయపెడుతున్నట్లుగా కోపంతో పెద్దగా తెరిచిన ఆ కళ్లు ఈ ఫోటోలో ప్రధాన ఆకర్షణ. చిన్న పిల్లలు చూస్తే భయపడటం ఖాయం. ఇతరుల చెడు దృష్టి పడకూడదనే నమ్మకంతో ఈ ఫోటోను వాడుతున్నారు.
ఫోటోలోని ఆ నిగూఢ మహిళ ఎవరు? ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికీ ఆ మహిళ ఎవరనే ప్రశ్న కలగక మానదు. బెంగళూరులో నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఒక మహిళకు కూడా ఇదే సందేహం కలిగింది. ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ఫోటోను షేర్ చేసి, “ఈమె ఎవరు? గూగుల్ లెన్స్‌లో వెతికినా వివరాలు దొరకడం లేదు” అని ప్రశ్నించింది. జనవరి 5, 2026న చేసిన ఈ పోస్ట్ ఏకంగా 3.2 మిలియన్ల వీక్షణలను (Views) సాధించి వైరల్‌గా మారింది.
నెటిజన్ల సమాధానం: ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒకరు దీనిని నెగటివ్ ఎనర్జీని దూరం చేసే ‘నజర్ బట్టు’ అని అంటే, మరొకరు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో ఈమెను గుర్తించారు. ఆ వివరాల ప్రకారం.. ఈమె కర్ణాటకకు చెందిన యూట్యూబర్ నిహారికా రావు. 2023లో ఆమె చేసిన ఒక వీడియోలో ఆమె ఇచ్చిన ఆశ్చర్యకరమైన హావభావం సోషల్ మీడియాలో మీమ్ (Meme) గా మారింది. ఆ తర్వాత ప్రజలు ఆమె ముఖాన్ని దృష్టిని దూరం చేసే పోస్టర్‌గా మార్చేశారు. అయితే దీనిపై స్పష్టత లేనప్పటికీ, నెటిజన్లు మాత్రం ఈమె నిహారికా రావు అని నమ్ముతున్నారు.
