భారతదేశంలోని అనేక నగరాలు వాటి ప్రత్యేకమైన రంగుల పేర్లతో ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ రంగులు కేవలం పేర్లు మాత్రమే కాదు; ప్రతి నగర చరిత్ర, వాస్తుశిల్పం, ప్రకృతి సౌందర్యం మరియు స్థానిక విశేషాలతో ముడిపడి ఉన్నాయి.
ఇలాంటి నగరాల్లో ఎక్కువ శాతం రాజస్థాన్‌లోనే ఉన్నాయి.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌ను ‘పింక్ సిటీ’ (గులాబీ నగరం) అని పిలుస్తారు. 1876లో వేల్స్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్‌కు ఘన స్వాగతం పలికేందుకు, అప్పటి రాజు రెండవ సవాయ్ రామ్ సింగ్ పాత జైపూర్ నగరంలోని భవనాలన్నింటికీ గులాబీ-టెర్రకోట (కాషాయ) రంగు వేయించారని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ పాత నగరంలోని కట్టడాల్లో ఆ రంగును చూడవచ్చు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను ‘ఆరెంజ్ సిటీ’ అని పిలుస్తారు. దీనికి నగర భవనాల రంగు కారణం కాదు; అక్కడ విరివిగా పండే తియ్యని నారింజ పండ్లే దీనికి కారణం. అదేవిధంగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను ‘గోల్డెన్ సిటీ’ (స్వర్ణ నగరం) అంటారు. ఇక్కడి ఇళ్లు, కోటలు, రాజభవనాలను పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించడం వల్ల.. సూర్యకాంతి పడినప్పుడు అవి బంగారంలా మెరిసిపోతూ కనిపిస్తాయి.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ను ‘వైట్ సిటీ’ (శ్వేత నగరం) అని పిలుస్తారు. ఇక్కడి చారిత్రక భవనాలు, రాజభవనాల్లో తెల్లటి పాలరాతిని విస్తారంగా ఉపయోగించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక దక్షిణ భారతదేశంలోని తిరువనంతపురం నగరం పచ్చని ప్రకృతి, చెట్లతో నిండిన ఆహ్లాదకర వాతావరణం కారణంగా ‘భారతదేశ హరిత నగరం’ (ఎవర్‌గ్రీన్ సిటీ)గా ప్రసిద్ధి చెందింది. ఇలా ప్రతి నగరానికి ఆయా రంగుల పేర్లు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర, కారణం దాగి ఉన్నాయి.

Leave a Reply