భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా షాక్: ‘హై-రిస్క్’ విభాగంలోకి భారత్! దీని అర్థం ఏమిటి?

ఆస్ట్రేలియా ప్రభుత్వం స్టూడెంట్ వీసాల విషయంలో భారతదేశాన్ని అత్యంత ప్రమాదకరమైన విభాగం (Assessment Level 3 – AL3) కిందకు చేర్చింది. దీనివల్ల ఇకపై భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలించడమే కాకుండా, డాక్యుమెంట్ల విషయంలో కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు.

ఆస్ట్రేలియా వీసా అంచనా విధానం AL1 (తక్కువ రిస్క్) నుండి AL3 (ఎక్కువ రిస్క్) వరకు ఉంటుంది. భారత్ ఇప్పటివరకు AL2లో ఉండగా, ఇప్పుడు AL3కి మార్చబడింది. ఆస్ట్రేలియాలో ఉన్న సుమారు 6.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 1.4 లక్షల మంది భారతీయులే ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఈ మార్పులు జనవరి 8, 2026 నుండి అమలులోకి వచ్చాయి. భారత్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలను కూడా AL3 కిందకు చేర్చారు. పాకిస్థాన్ ఇప్పటికే ఈ హై-రిస్క్ విభాగంలోనే కొనసాగుతోంది.

కొత్తగా అవసరమయ్యే డాక్యుమెంట్లు:

ఇకపై విద్యార్థులు కింది వాటిని మరింత పక్కాగా సమర్పించాల్సి ఉంటుంది:

  • ఆర్థిక స్థితిగతులు: బ్యాంకు నిల్వలపై మరింత స్పష్టమైన ఆధారాలు.
  • ఆంగ్ల భాషా నైపుణ్యం: ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్లు.
  • నిజమైన ఉద్దేశ్యం: చదువుకోవడానికి మాత్రమే వస్తున్నట్లు (Genuine Temporary Entrant) నిరూపించుకోవాలి.

ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ విభాగం మాజీ డిప్యూటీ సెక్రటరీ అబుల్ రిజ్వీ మాట్లాడుతూ.. అధికారులు కేవలం డాక్యుమెంట్లను చూడటమే కాకుండా, వాటి వెనుక ఉన్న నిజానిజాలను కూడా తనిఖీ చేస్తారని తెలిపారు. వారు నేరుగా బ్యాంకులకి లేదా విద్యా సంస్థలకు ఫోన్ చేసి మీ సర్టిఫికెట్లు, ఆర్థిక నివేదికలను ధృవీకరించుకోవచ్చు.

కేరళ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం ప్రభావం?

భారతదేశాన్ని హై-రిస్క్ కేటగిరీలోకి చేర్చడానికి కేరళలో బయటపడిన భారీ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ ఒక కారణమని భావిస్తున్నారు. సుమారు 10 లక్షల మందికి పైగా వ్యక్తులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేసినట్లు కేరళ పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే సుమారు 23,000 మంది విద్యార్థులు ‘కొనుగోలు చేసిన’ డిగ్రీలతో ఉన్నారని ఆస్ట్రేలియన్ సెనేటర్ మాల్కం రాబర్ట్స్ ఆరోపించారు.


Posted

in

by

Tags: