ఢాకా: భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించే బంగ్లాదేశ్ విద్యార్థి నేత హదీ కాల్పుల్లో మరణించడంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. హదీ అంత్యక్రియల్లో పాల్గొన్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. “నువ్వు మాకు చెప్పిన లక్ష్యాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము” అని ప్రతిజ్ఞ చేశారు.
భారత్‌తో సంబంధాలను తెంచుకోవాలని, బంగ్లాదేశ్‌పై భారత్ నియంత్రణ ఉండకూడదని భారత్ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తి కలను నెరవేరుస్తానని యూనస్ హామీ ఇవ్వడం భారతదేశంలో అసంతృప్తికి దారితీసింది.
ఎవరీ హదీ? ఇతని పూర్తి పేరు షరీఫ్ ఉస్మాన్ హదీ. గతేడాది బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా తిరుగుబాటులో విద్యార్థి సంఘాల పాత్ర కీలకం. అటువంటి విద్యార్థి సంఘాలలో ఒకటైన ‘ఇంక్విలాబ్ మంచో’ సీనియర్ నాయకుడే ఈ హదీ. 1994లో జన్మించిన హదీ తన తీవ్రమైన రాజకీయ వ్యాఖ్యల ద్వారా గుర్తింపు పొందారు. భారత్‌ను విమర్శించడంలోనూ, జూలై తిరుగుబాటులోనూ ఆయన ముందున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఢాకా-8 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించారు.
ప్రస్తుత ఆందోళనలకు కారణం: డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు హదీపై కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో ఢాకాలోని ఆసుపత్రిలో చేర్పించి, ఆపై మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అయితే డిసెంబర్ 18న చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ‘ఇంక్విలాబ్ మంచో’ కార్యకర్తలు హింసకు దిగారు. ‘ది డైలీ స్టార్’, ‘ప్రొథోమ్ ఆలో’ వంటి మీడియా కార్యాలయాలకు నిప్పు పెట్టారు.
భారత్‌కు వ్యతిరేకంగా మారుతున్న బంగ్లాదేశ్? ఈ నిరసనలు అంతటితో ఆగలేదు. భారత కాన్సులేట్‌పై రాళ్ల దాడి కూడా జరిగింది. హదీ హత్య వెనుక భారత్ హస్తం ఉందని, హంతకుడు భారత్‌కు పారిపోయాడని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్ యువత ఇప్పుడు భారత్ వ్యతిరేక దిశలో వెళ్తుండగా, దేశాధినేత యూనస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
యూనస్ ఏమన్నారు? సింగపూర్ నుండి హదీ భౌతికకాయం బంగ్లాదేశ్‌కు తీసుకువచ్చినప్పుడు, వేలాది మంది ప్రజలు నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న యూనస్ మాట్లాడుతూ.. హదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, అతని నమ్మకాలను దేశం గౌరవిస్తుందని చెప్పారు. “నువ్వు మాకు చెప్పిన దాన్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని నీకు హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము” అని యూనస్ అనడంపై భారత్ దృష్టి సారించింది. యూనస్ కూడా భారత్ వ్యతిరేక వైఖరి తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
