భారతదేశంలో ఉంటున్న పోలాండ్‌కు చెందిన అగ్నిస్జ్కా హడాలా, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంక్షోభాల పట్ల మీడియా అనుసరిస్తున్న రెండు రకాల వైఖరిపై సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించారు.
ఆమె ఏమన్నారంటే? ఇన్స్టాగ్రామ్ వీడియోలో చీర కట్టుకుని, బిందీ పెట్టుకుని కనిపించిన ఆమె, పశ్చిమ దేశాల్లో వడగాల్పులు వస్తే ‘విషాదం’ అని, అదే భారత్‌లో వస్తే ‘వైఫల్యం’ అని ఎందుకు అంటారని ప్రశ్నించారు. “భారత్ బాధపడితే అది వైఫల్యం, అదే పశ్చిమ దేశాలు బాధపడితే అది విషాదం. ఈ వివక్ష ఎందుకు?” అని ఆమె నిలదీశారు.
యూరప్‌లో పరిస్థితి: ప్రస్తుతం పోలాండ్‌లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని, ఆదివారం రికార్డు స్థాయిలో 40.5 డిగ్రీలకు చేరిందని ఆమె వివరించారు. అక్కడ పాఠశాలలు మూతపడటం, ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడటం, ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆమె తెలిపారు. భారత్‌లో 35 డిగ్రీలను ఆహ్లాదకరంగా భావిస్తారని, వేసవిలో 40-50 డిగ్రీల ఉష్ణోగ్రతలను ఇక్కడి వారు తట్టుకుంటారని ఆమె గుర్తుచేశారు.
భారతీయులపై వెక్కిరింతలు – యూరప్‌పై సానుభూతి: ఒకప్పుడు ముంబైలోని వర్సోవా బీచ్‌లో విద్యుత్తు లేక ప్రజలు ఇసుకలో పడుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వారిని మీమ్స్‌తో వెక్కిరించారని ఆమె గుర్తుచేశారు. కానీ, అదే పరిస్థితి ఇప్పుడు యూరప్‌లో ఉంటే, ప్రజలు పార్కుల్లో, బీచ్‌లలో నిద్రిస్తుంటే ప్రపంచం సానుభూతి చూపుతోందని, ఇది రెండు నాల్కల ధోరణి అని ఆమె విమర్శించారు. మానవత్వంతో అందరినీ సమానంగా చూడాలని ఆమె కోరారు.
నెటిజన్ల స్పందన: ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె అభిప్రాయాన్ని ప్రశంసిస్తున్నారు. “భారతీయులుగా మాకు ఇలాంటి ధైర్యవంతమైన మాటలు వింటే గర్వంగా ఉంది,” “మీరు భారతీయుల కంటే గొప్పగా ఆలోచిస్తున్నారు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భారత్ వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని చిన్న దేశాలతో పోల్చడం సరికాదని ఆమె వాదించారు.
