“భారత్‌లో కంటే పాకిస్థాన్‌లో ఉండేందుకే హిందువులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు!” పాక్ అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు… తమ దేశంలో ఫుల్ స్వేచ్ఛ ఉందట!

పాకిస్థాన్‌లో నివసిస్తున్న మైనారిటీ హిందువులు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్నట్లే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్వేచ్ఛతో, సకల హక్కులతో జీవిస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు.

రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పాక్‌లోని మైనారిటీల పరిస్థితితో పాటు భారత్‌ను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జర్దారీ మాట్లాడుతూ.. “పాకిస్థాన్‌లో దాదాపు 3 నుంచి 4 శాతం వరకు హిందూ జనాభా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో మైనారిటీలు ఎలా స్వేచ్ఛగా బతుకుతున్నారో, మా దేశంలోనూ హిందువులు అంతే సమాన హక్కులతో క్షేమంగా జీవిస్తున్నారు. మాకు మత సహనం ఎక్కువ. ఇక్కడున్న హిందువులు భారతదేశంలో నివసించడం కంటే, మాతో కలిసి పాకిస్థాన్‌లోనే ఉండేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు” అని వ్యాఖ్యానించడం గమనార్హం.

అనంతరం భారత్‌పై విమర్శలు గుప్పిస్తూ.. “భారతీయులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంటుంది. వారు ఇప్పటికీ ‘అఖండ భారత్’ భావజాలాన్ని బలంగా నమ్ముతున్నారు తప్ప, దాని వెనుక ఉన్న చారిత్రక పరిణామాలను పూర్తిగా విస్మరిస్తున్నారు” అని ఆరోపించారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీశాయి.


Posted

in

by

Tags: