లండన్: బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల లోరీ డెన్మన్ భారత పర్యటన అనూహ్యమైన వైద్య సవాలుగా మారింది. భారత్‌లో పర్యటించిన కొన్నేళ్ల తర్వాత, ఆమె మెదడులో పరాన్నజీవులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ చికిత్స తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.
సాధారణ లక్షణంతో మొదలై..: 2007లో మూడు నెలల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన లోరీ డెన్మన్, ఒకానొక దశలో తన శరీరంలోంచి పొడవాటి టేప్‌వార్మ్ (పన్నె పురుగు) బయటకు రావడాన్ని గమనించారు. మొదట్లో ఇది పెద్ద సమస్య కాదని భావించినా, ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా దిగజారింది. 2011లో ఆమెకు మొదటిసారిగా ఫిట్స్రా వడంతో, పరీక్షలు చేయగా ‘న్యూరోసిస్టైసెర్కోసిస్’ (Neurocysticercosis) అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
మెదడులో 38 పరాన్నజీవులు: వైద్య పరీక్షల్లో, ఆమె మెదడులో లార్వా దశలో ఉన్న 38 పరాన్నజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన తలనొప్పి, ఫిట్స్, జ్ఞాపకశక్తి మందగించడం మరియు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు. ఎన్నో రకాల మందులు, వరుస చికిత్సలు చేపట్టినప్పటికీ, ఆమె సుదీర్ఘకాలం వైద్య పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. చివరకు 2022లో ఆమె పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు.
వైద్యుల హెచ్చరిక: టేప్‌వార్మ్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే న్యూరోసిస్టైసెర్కోసిస్ అనేది మెదడుపై తీవ్ర ప్రభావం చూపే వ్యాధి. పంది మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం లేదా అపరిశుభ్రమైన ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. కడుపు నొప్పి, మలంలో పురుగులు పడటం, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
