భర్త కష్టాన్ని అవమానించిన భార్య: రాజస్థాన్ నుండి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక భర్త తన భార్య కలలను సాకారం చేయడం కోసం అప్పు చేసి మరీ ఆమెను చదివించాడు. భార్యకు ఉద్యోగం వచ్చింది, కానీ ఆ తర్వాత ఆమె భర్తను వదిలేసింది. ఈ వ్యవహారంలో భార్య మోసపూరిత మార్గాల్లో ఉద్యోగం పొందిందని ఆరోపిస్తూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
15 లక్షల అప్పు: తన భార్య చదువు కోసం తాను రూ. 15 లక్షలు ఖర్చు చేశానని, ఇందుకోసం తన భూమిని కూడా తాకట్టు పెట్టానని భర్త పేర్కొన్నాడు. అయితే, ఉద్యోగం వచ్చిన రెండు నెలలకే ఆమె తనను వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. భార్య రైల్వే గ్రూప్-డి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుందని, ఆ పరీక్ష పాస్ అవ్వడం కోసం ఆమె తన బంధువు ద్వారా ఒక ‘డమ్మీ అభ్యర్థిని’ (Dummy candidate) పరీక్షకు కూర్చోబెట్టిందని భర్త బయటపెట్టాడు. ఈ అక్రమ మార్గం ద్వారానే ఆమె ఉద్యోగం సంపాదించింది. శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత, ఆమె భర్తతో కలిసి ఉండటానికి నిరాకరించింది.
రైల్వే శాఖ చర్యలు: తనతో కలిసి ఉండటం ఇష్టం లేదని భార్య తేల్చి చెప్పడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన భర్త రైల్వే జనరల్ మేనేజర్ మరియు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ, ఆమెను సస్పెండ్ చేసి విచారణ చేపట్టింది. తన భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ భర్త డిమాండ్ చేస్తున్నాడు.
