పుణెలోని ఉరుళీ కాంచన్ పరిధిలో సమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా భర్త తన భార్యపై అమానుషంగా అత్యాచారానికి, దారుణమైన హింసకు పాల్పడ్డాడనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.
మగపిల్లాడు కలగలేదనే కారణంతో నిందితుడైన భర్త భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా భార్య తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నట్లు సమాచారం.
భార్యపై యాసిడ్ పోసి వికృత చేష్టలు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడైన భర్త ఆమె చారిత్రంపై (నడవడికపై) నిరంతరం అనుమానం పెంచుకునేవాడు. “నీకు ఇద్దరు ఆడపిల్లలే ఎందుకు పుట్టారు, మగపిల్లాడు ఎందుకు కలగడం లేదు” అంటూ ఆమెను మానసికంగా వేధించేవాడు. ఇదే విషయమై కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో నిందితుడు భార్యపై యాసిడ్ పోసి అమానుషంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది.
15 రోజుల పాటు ఇంట్లోనే బంధించినట్లు తీవ్ర ఆరోపణ ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. అంతటితో ఆగకుండా, నిందితుడు ఆమెను దాదాపు 15 రోజుల పాటు ఇంట్లోనే బంధించి ఉంచాడని బాధితురాలి తరఫున తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రూరత్వం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాగా, భర్త పెట్టే హింసను భరించలేక మే 9న అతను పనికి వెళ్లిన సమయంలో బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని పుట్టింటికి చేరుకుంది. అక్కడ తన కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని వివరించింది. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, నిందితుడైన భర్తపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.
