ముంబైలోని భైఖలా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపులో ‘పెయిన్ కిల్లర్’ అని చెప్పి విషపూరితమైన క్యాప్సూల్స్ పంచిన ఘటనలో పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వివాహ విచ్ఛిన్నం మరియు ప్రతీకారం: పూణేకు చెందిన 39 ఏళ్ల నిందితుడు ఫయాజ్ ప్రేమ్‌జీ, రెండేళ్ల క్రితం తన భార్య వదిలేసి వెళ్ళిపోవడంతో, ప్రపంచంపైనే పగ పెంచుకున్నానని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ మానసిక స్థితిలోనే, మొహర్రం ఊరేగింపులో 15,000 మందిని చంపేందుకు అతను పథకం వేశాడని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేనట్లు అనిపిస్తుండటంతో, అతను ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
‘ఇరాన్ కనెక్షన్’పై దర్యాప్తు: ఈ కేసులో మరో కొత్త మలుపు ఏమిటంటే, నిందితుడికి ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ఫయాజ్ తల్లి, సోదరి ప్రస్తుతం ఇరాన్లో ఉంటున్నారు, అతని సోదరి అక్కడ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఫయాజ్ స్వయంగా గతంలో ఇరాక్, ఇరాన్ దేశాల్లో పనిచేశాడు. అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు.
పెయిన్ కిల్లర్ పేరుతో విషం: శుక్రవారం సాయంత్రం, బురఖా ధరించిన ఒక మహిళ ద్వారా భక్తులకు పెయిన్ కిల్లర్స్ అని చెప్పి ఈ క్యాప్సూల్స్ పంచారు. అవి వేసుకున్న వెంటనే చాలామందికి వాంతులు, కళ్లు తిరగడం, స్పృహ తప్పి పడిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. పోలీసులు ఫయాజ్ బస చేసిన గెస్ట్ హౌస్‌లో దాడులు చేయగా, దాదాపు 14,900 క్యాప్సూల్స్ లభించాయి. వాటిలో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందు ఉందని వైద్య నిపుణులు నిర్ధారించారు. ఇది నేరుగా రక్తంలో కలిసి అవయవాల వైఫల్యానికి (Multiple Organ Failure) కారణమవుతుందని వారు హెచ్చరించారు.
