హైదరాబాద్లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.
ఈ ఘోర ప్రమాదంతో అక్కడ తీవ్ర భయాందోళనలు, ఉద్రిక్తత నెలకొన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ, పెట్రోల్ బంక్లోని ఇంధన పంపిణీ యంత్రాలు (ఫ్యూయల్ డిస్పెన్సర్లు) తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
అదృష్టవశాత్తూ ఆ యంత్రాల నుంచి పెట్రోల్ లేదా డీజిల్ లీకేజీ కాకపోవడంతో పెను అగ్ని ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన బస్సు శరవేగంగా పెట్రోల్ బంక్లోకి చొచ్చుకొచ్చి, అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్న కారును, ఓ ఆటో ట్రాలీని బలంగా ఢీకొట్టిన భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి.
బస్సు దూసుకొస్తుండటాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీసి తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. అదే సమయంలో ఉద్యోగికి డబ్బులు ఇస్తున్న మరో వాహనదారుడు కూడా సురక్షితంగా బయటపడ్డాడు. బస్సు వెళ్లి యంత్రాన్ని ఢీకొట్టగానే, లోపల ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిందకు దిగి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
బస్సు వేగానికి ఇంధనం నింపే యంత్రం ఒక్కసారిగా పెకలించుకుని బంక్ మరోవైపునకు ఎగిరిపడింది. డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా కారు ముందు భాగం, ఆటో ట్రాలీ వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంతటి తీవ్ర ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
