కిరణ్ మరియు 27 ఏళ్ల ప్రేరణ గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే టెలికాం కంపెనీలో కలిసి పనిచేసేవారు. మంగళవారం ప్రేరణ తల్లి, సోదరుడు ఇంట్లో లేని సమయంలో ఆమె కిరణ్‌ను తన ఇంటికి పిలిపించింది.
నమ్మించి మోసం: పోలీసుల విచారణ ప్రకారం.. ప్రేరణ తన ప్రియుడికి ‘వెస్ట్రన్ స్టైల్’లో ప్రపోజ్ చేస్తానని నమ్మించింది. కిరణ్‌ను ఒక కుర్చీలో కూర్చోబెట్టి, అతని కాళ్లు చేతులు గట్టిగా కట్టేయడం మొదలుపెట్టింది. కిరణ్ దీనిని ప్రశ్నించగా, ఇది ఒక ‘రొమాంటిక్ సర్ప్రైజ్’లో భాగమని చెప్పి అతడిని శాంతింపజేసింది. ప్రేయసిని పూర్తిగా నమ్మిన కిరణ్ ఎటువంటి ప్రతిఘటన చేయలేదు.
కిరాతక హత్య: కిరణ్ కదల్లేని స్థితికి చేరుకోగానే, ప్రేరణ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కుర్చీకి కట్టేసి ఉండటంతో కిరణ్ తప్పించుకునే అవకాశం లేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇది కేవలం హత్య మాత్రమే కాదని, ఒక వికృత మానసిక స్థితికి పరాకాష్ట అని పోలీసులు తెలిపారు.
అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. కిరణ్ మంటల్లో కాలిపోతూ నరకం అనుభవిస్తున్న సమయంలో, ప్రేరణ తన మొబైల్ ఫోన్‌తో ఆ దృశ్యాలను వీడియో తీసింది. ఈ హత్య కోసం ఆమె ముందుగానే ఇంట్లో పెట్రోల్ సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఆవేశంలో చేసిన పని కాదని, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని తేలింది.
హత్యకు గల కారణం: ప్రాథమిక విచారణలో తెలిసిన సమాచారం ప్రకారం.. కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడనే కోపంతో ప్రేరణ ఈ దారుణానికి ఒడిగట్టింది. మొదట ఆమె పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించింది. తాను వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు కిరణ్ నిప్పంటించుకున్నాడని అబద్ధం చెప్పింది. కానీ, సీసీటీవీ ఫుటేజీ మరియు ఫోరెన్సిక్ ఆధారాల ముందు ఆమె అబద్ధాలు నిలవలేదు.
ప్రస్తుతం పోలీసులు ప్రేరణను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మొబైల్ లో దొరికిన హత్య వీడియోనే ఈ కేసులో అత్యంత బలమైన సాక్ష్యంగా మారింది.
