మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. వేరే మతానికి చెందిన మహిళతో ఉన్నాడనే ఆరోపణతో ఒక వ్యక్తిని కొందరు యువకులు దారుణంగా కొట్టి, అవమానించి, అర్థనగ్నంగా వీధుల్లో ఊరేగించారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ‘బజరంగ్ దళ్’ అనే మితవాద సంస్థతో సంబంధం ఉందని చెప్పుకుంటున్న నిందితులు, ఆ వ్యక్తిని కొట్టి, ముఖానికి సిరా మరియు ఆవు పేడ పూశారు. నినాదాలు చేస్తూ అతడిని అర్థనగ్నంగా వీధిలో నడిపించారు.
శనివారం మధ్యాహ్నం గోవింద్‌పురా ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఒక హోటల్ వెలుపల తన మతానికి చెందని మహిళతో ఆ వ్యక్తి కనిపించాడనే నెపంతో ఈ దాడికి పాల్పడ్డారు. బహిరంగంగా అతడిని అవమానిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ముందు దాదాపు గంటపాటు ఈ హింస కొనసాగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని మరియు మహిళను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.
సదరు మహిళ పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తూ.. ఆ వ్యక్తి తనకు చాలా కాలంగా తెలుసని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని తాను కోరుకోవడం లేదని తెలిపింది. ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు వారిద్దరినీ పంపించివేశారు. ఈలోగా దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది. “ఫిర్యాదుతో పాటు వీడియో క్లిప్‌ను కూడా అందుకున్నాము. దీనిని పరిశీలించి, బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము,” అని భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు.
