తమిళనాడులోని వెల్లూరు జిల్లా గుడియాట్టం సమీపంలో ఉన్న పెరియ పరవక్కల్ గ్రామానికి చెందిన అజిత్ కుమార్ (24) అనే యువకుడు డోలు కళాకారుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఒక రోజు రాత్రి అజిత్ కుమార్ మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన 77 ఏళ్ల వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఘటన వివరాలు: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని ఆ వృద్ధురాలిని అడిగాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన అజిత్ కుమార్ ఆ వృద్ధురాలిపై దాడి చేసి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వృద్ధురాలు స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని భయపడిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం పొరుగువారు గమనించి ఆమె కుమారుడికి సమాచారం అందించారు.
నిందితుడి అరెస్ట్: మొదట వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స అనంతరం ఇంటికి పంపారు. అయితే ఆమె భయంతో వణికిపోవడాన్ని గమనించిన కుమారుడు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అజిత్ కుమార్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు గుడియాట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో అజిత్ కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
