మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. తల్లి చనిపోయిందని తెలియక పక్కనే నిద్రపోయిన పిల్లలు..!

చెన్నైలోని పోరూరు ఆర్‌ఈ నగర్ ప్రాంతానికి చెందిన సత్యరాజ్ భార్య రోసీ హౌస్ కీపింగ్ పని చేసేది. ఈ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు సూర్య, 7 ఏళ్ల కుమార్తె నిత్య ఉన్నారు.

గత రెండు రోజుల క్రితం రోసీ ఇంట్లో స్పృహ లేకుండా పడి ఉంది. తల్లి నిద్రపోతోందని భావించిన పిల్లలు, స్కూలు సెలవు కావడంతో బయటకు వెళ్లి ఆడుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని తమ పిన్ని (తల్లి సోదరి) ఇంటికి వెళ్లి, రాత్రి అమ్మ-నాన్నల మధ్య గొడవ జరిగిందని చెప్పారు.

దీంతో అనుమానం వచ్చిన రోసీ సోదరి ఇంటికి వెళ్లి చూడగా, రోసీ అప్పటికే చలనం లేకుండా పడి ఉంది. స్థానికుల సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో సత్యరాజ్ రోసీని కొట్టి చంపి పరారైనట్లు తేలింది. అనంతరం మదురవాయల్ సమీపంలోని ఆలపాక్కం ప్రాంతంలో తిరుగుతున్న సత్యరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసు విచారణలో మరికొన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సత్యరాజ్‌కు మద్యపానం అలవాటు ఉందని, మద్యం మత్తులో తరచుగా భార్యతో గొడవపడేవాడని తెలిసింది. 24వ తేదీ రాత్రి తాగిన మైకంలో వచ్చిన అతను, రోసీతో వాగ్వాదానికి దిగి ఆమె తలని గోడకు బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాత్రంతా శవం పక్కనే ఉండి, ఉదయం పనికి వెళ్తున్నట్లు నటించి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags: