వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, అమెరికా తదుపరి సైనిక చర్య కొలంబియాపై ఉండవచ్చని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఈ ప్రకటనతో లాటిన్ అమెరికా దేశాల్లో ఆందోళన ఒక్కసారిగా పెరిగింది.
కొలంబియాపై ట్రంప్ ఆగ్రహం:
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, కొలంబియా నాయకత్వాన్ని, ముఖ్యంగా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను తీవ్రంగా విమర్శించారు.
- “కొలంబియా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొకైన్ తయారు చేసి అమెరికాకు విక్రయించాలనుకునే ఒక దుర్మార్గుడు ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ఇది ఎక్కువ కాలం సాగదు” అని ఆయన మండిపడ్డారు.
- కొలంబియాపై కూడా సైనిక చర్య తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు, “అది నాకు మంచి ఆలోచనగానే అనిపిస్తోంది.. కాబట్టి దాన్ని చేయవచ్చు” అని ట్రంప్ సమాధానమివ్వడం సంచలనం సృష్టించింది.
వెనిజులా ఆపరేషన్ వివరాలు:
కారకాస్‌లో శనివారం అర్ధరాత్రి అమెరికా సైన్యం మెరుపు దాడి చేసి నికోలస్ మదురో మరియు అతని భార్య సిలియా ఫ్లోరెస్లను అదుపులోకి తీసుకుంది.
- భయం లేని మదురో: న్యూయార్క్‌లోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) కార్యాలయానికి తరలించినప్పుడు, మదురో అధికారులను చూసి నవ్వుతూ “గుడ్ నైట్, హ్యాపీ న్యూ ఇయర్” అని విష్ చేశారు. జైలుకు వెళ్తున్నాననే భయం లేకుండా ఆయన చూపిన తెగువ చర్చనీయాంశమైంది.
- తీవ్రమైన అభియోగాలు: మదురోపై నార్కో-టెర్రరిజం (మత్తుపదార్థాల ఉగ్రవాదం), కొకైన్ అక్రమ రవాణా మరియు ఆయుధాల వినియోగం వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఆయనను బంధించడానికి సహకరించిన వారికి గతంలోనే అమెరికా 15 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.
మెరుపు దాడి – ప్రాణనష్టం:
అమెరికా కమెండోలు మదురో బెడ్ రూమ్ లోకి చొరబడి ఆయనను బంధించారు. ఈ దాడి సమయంలో కారకాస్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా జరిపిన ఈ దాడిలో సామాన్య పౌరులు, వెనిజులా సైనికులు మరణించారని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధృవీకరించారు.
