చైనాలో నివసిస్తున్న ఒక వృద్ధ దంపతుల ఇంట్లో, వారి సొంత మనవరాలు చెన్ వరుసగా బంగారు గొలుసుతో పాటు సుమారు రూ. 3 లక్షల నగదును దొంగిలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
పలుమార్లు ఇలాగే దొంగతనాలకు పాల్పడుతున్న ఆమె చేష్టల గురించి తెలుసుకున్న ఆ వృద్ధ దంపతులు, ఆమెకు సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
అనంతరం, బంధుత్వాలకు తావివ్వకుండా ధైర్యంగా నిర్ణయం తీసుకున్న ఆ వృద్ధులు, తమ మనవరాలిని నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో పోలీసుల వద్ద ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడిన చెన్.. ఇది తమ కుటుంబ విషయమని, ఎలాగైనా తన తాతయ్య, నానమ్మలే తనను క్షమిస్తారని తేలికగా తీసుకుంటూ మాట్లాడింది.
అయితే, తప్పు చేసిన ఆమెను వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ఉన్న ఆ వృద్ధ దంపతులు ఆమెను క్షమించేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. దీనిపై కోర్టులో విచారణ జరిపిన న్యాయమూర్తులు.. సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడినందుకు చెన్ అనే ఆ యువతికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు.
