మనసును తాకే సందేశం: భార్యాభర్తల బంధం మాత్రమే ప్రాణం ఉన్నంత వరకు తోడుంటుంది!

ఒక యువకుడు ఒక అమ్మాయి ఫోటో చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ, మొదటి రాత్రి ఆమె ముఖం చూసి షాక్ అవుతాడు. దానికి కారణం ఆమె రంగు కొంచెం నలుపు కావడం. అతనికి ఆమె నచ్చలేదు, ఆమెను ద్వేషించడం మొదలుపెట్టాడు. తన భర్త తనను దూరం పెడుతున్నా, ఆ భార్య మాత్రం అతనిపై అపారమైన ప్రేమను, అనురాగాన్ని చూపిస్తూనే ఉంది.

ఒకరోజు ఆమె భర్తతో.. “ఎందుకు నన్ను ఇలా ద్వేషిస్తున్నారు? నేను మీ భార్యను, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదు?” అని ప్రాధేయపడింది. కానీ అతను ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు.

ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. నొప్పి భరించలేక “అమ్మో.. నాన్నా..” అని కేకలు వేశాడు. అది చూసిన భార్య, తన భర్త కంటే ఎక్కువగా ఏడ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు, అతని స్నేహితులకు ఫోన్ చేసింది. భర్త పడుతున్న బాధను చూడలేక ఒక పిచ్చిదానిలా తల పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఏడవసాగింది.

తనను ద్వేషించే వ్యక్తి కోసం ఆమె పడుతున్న తపన చూసి ఆ భర్తకు నోట మాట రాలేదు. స్నేహితుడు కారు తీసుకుని రాగానే, తన భర్తను గుండెలకు హత్తుకుని, “అన్నయ్య.. కొంచెం వేగంగా వెళ్ళండి” అని ప్రాధేయపడింది. ఆ క్షణంలో “ఛీ.. ఇటువంటి గొప్ప మనసున్న మనిషినా నేను ద్వేషించాను?” అని భర్త కళ్ళు మూసుకుని ఏడ్చాడు.

ఆసుపత్రిలో చేర్చిన తర్వాత.. బంధువులందరూ వచ్చారు. ఆమె ఏడుపు ఇంకా ఆగలేదు. భర్తపై ఆమెకు ఉన్న ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. “సిగరెట్లు తాగడం వల్ల ఇలా జరిగింది” అని డాక్టర్ చెప్పారు. అందరూ అతనికి హితబోధ చేస్తుంటే, అతను మాత్రం తన భార్య కోసం వెతుకుతున్నాడు.

ఆమె గుమ్మం దగ్గర నిలబడి ఇంకా ఏడుస్తూనే ఉంది. మొదటిసారి తన భార్య పేరును ప్రేమతో పిలిచాడు. ఆమె ఒక్క ఉదుటన లోపలికి పరుగెత్తుకొచ్చింది. భార్య చేతిని పట్టుకుని, “నీ కోసమే.. ఇకపై నేను ఎప్పుడూ సిగరెట్లు తాగను” అని మాట ఇచ్చాడు. తన భర్త తనతో మాట్లాడుతున్నాడనే సంతోషంతో, ఆమె ఏడుస్తూనే నవ్వింది. “నీకు నాపై ఇంత ప్రేమా?” అని భర్త కళ్లతోనే అడిగితే.. “మీరు నా భర్త, నేను మీ భార్యను” అని ఒక్క మాటలో వేల అర్థాలు చెబుతూ అతని నుదుటిపై ముద్దు పెట్టింది ఆ ఇల్లాలు.

లోకం ఎంత మారినా, భర్తను ప్రాణంగా ప్రేమించే భార్యలు ఇంకా ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలు ఏదో ఒక సమయంలో మనల్ని వదిలి వెళ్ళిపోతాయి, కానీ భార్యాభర్తల బంధం మాత్రమే చచ్చే వరకు తోడుంటుంది.


Posted

in

by

Tags: