బీహార్ రాష్ట్రంలో సాయంత్రం కోచింగ్ తరగతులు ముగించుకుని తిరిగి వస్తున్న ఓ బాలుడు, బాలికను ముసుగులు ధరించిన దుండగుల ముఠా చుట్టుముట్టి లైంగిక వేధింపులకు గురిచేసిన షాకింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జముయ్ జిల్లాలో గత సెప్టెంబర్ 19న జరిగిన ఈ అరాచక ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో విడుదలై వేగంగా వ్యాపిస్తున్నాయి.
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, వారిద్దరినీ పలువురు దుండగులు చుట్టుముట్టి బెదిరించడం, ఒకడు బాలికను బలవంతంగా లాక్కెళ్లి లైంగిక వేధింపులకు గురిచేయడానికి ప్రయత్నించడం స్పష్టంగా రికార్డైంది. ఆ బాలిక వారి బారినుంచి తప్పించుకునేందుకు పెనుగులాడగా, ఆ తర్వాత ఇద్దరూ ఆ ముఠాను బతిమిలాడుకుని అక్కడి నుంచి ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ వీడియో దృశ్యాలు ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, నిందితులపై బీహార్ పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జముయ్ జిల్లా పోలీసులు, దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధిత బాలుడు, బాలికను గుర్తించిన పోలీసు అధికారులు వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అంతేకాకుండా, ఈ అరాచకానికి పాల్పడిన నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply