మరణించిన మహిళ ఆస్తిపై హక్కు ఎవరిది? పుట్టింటివారికా.. అత్తగారింటివారికా? ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

ముంబై: ఒక మహిళ మరణించిన తర్వాత, హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం ఆమె ఆస్తిపై ఆమె భర్త బంధువులకే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తూ ముంబై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో మృతురాలి సోదరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

బిమల్ సిక్కా (81) మరణించిన తర్వాత ఆమె ఆస్తిపై హక్కు కోసం ఆమె సోదరుడు కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఫిర్దోష్ పునీవాలా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. తాను బిమల్ సిక్కాకు అత్యంత సన్నిహిత రక్తసంబంధీకుడినని, కాబట్టి తన సోదరి ఆమె ఆడపడుచు (ననంద) పేరు మీద రాసిన విల్లు (Will) మరియు గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు.

మరోవైపు, బిమల్ సిక్కా ఆడపడుచు తన వాదన వినిపిస్తూ.. తాము భర్త తరపు బంధువులమని, బిమల్ స్వయంగా విల్లు ద్వారా ఆస్తిని తన పేరిట రాశారని తెలిపారు. అలాగే నేపియన్సీ రోడ్‌లోని ఫ్లాట్‌ను గిఫ్ట్ డీడ్ ద్వారా తన పేరిట బహుకరించారని, ఈ విల్లుకు మార్చి 2026లో ప్రోబేట్ (Probate) కూడా లభించిందని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.

కోర్టు పరిశీలన: ఆడపడుచుకు ఉన్న ఆస్తి హక్కును అంగీకరిస్తూ కోర్టు కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 ప్రకారం, ఒక హిందూ మహిళ మరణించిన తర్వాత ఆమె ఆస్తికి ఆమె భర్త వారసులే మొదటి ప్రాధాన్యత కలిగి ఉంటారు. ఈ కేసులో మృతురాలి భర్త సోదరి (ఆడపడుచు) జీవించి ఉన్నందున, వారసత్వ క్రమంలో ఆమెకే మొదటి హక్కు లభిస్తుంది. మృతురాలి సోదరుడు తర్వాతి వరుసలోకి వస్తాడు కాబట్టి అతనికి ఆస్తిపై హక్కు ఉండదు.

సెక్షన్ 15 ఇంకా అమలులోనే ఉంది: మహిళ ఆస్తిలో పుట్టింటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని లా కమిషన్ సూచించిందని సోదరుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే, లా కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ అది ఇంకా చట్టంగా మారలేదని కోర్టు పేర్కొంది. సెక్షన్ 15 ఇప్పటికీ అమలులో ఉందని, అలాగే మార్చి 7, 2026న విల్లుకు ప్రోబేట్ లభించినందున దానికి పూర్తి చట్టబద్ధత ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే, సోదరుడు ఆ ప్రోబేట్‌ను సవాలు చేసినందున ఈ న్యాయపోరాటం కొనసాగే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: