మరణం… ఇప్పటికీ ఎవరూ పూర్తిగా ఛేదించలేని ఒక రహస్యం. అయితే ఎవరైనా మరణం దాకా వెళ్లి, నాలుగు రోజుల పాటు పరలోకాన్ని చూసి వచ్చి, అక్కడి రహస్యాలను వెల్లడిస్తే ఎలా ఉంటుంది?
ఇది పమేలా నెన్స్ అనే మహిళ కథ. ఏప్రిల్ 1990లో ఒక సాయంత్రం ఆమె జీవితం శాశ్వతంగా మారిపోయింది. ఒకవైపు ఆమె తన చదువు, కెరీర్ గురించి కలలు కంటోంది, మరోవైపు ఆమె శరీరంలో ప్రాణాంతకమైన అల్సర్ పగిలిపోయింది. పమేలా స్పృహతప్పి పడిపోయినప్పుడు అది కేవలం ఒక మెడికల్ ఎమర్జెన్సీ అని డాక్టర్లు భావించారు. కానీ పమేలాకు అది ఒక అలౌకిక ప్రయాణం.
అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన పమేలా నెన్స్ ఒక విస్తుపోయే వాదన చేశారు. తాను నాలుగు రోజుల పాటు మరణం అంచుల్లో ఉన్నానని, ఆ సమయంలో పరలోక అనుభూతిని పొందానని ఆమె చెప్పారు. 1990లో ఆమె వయసు 22 ఏళ్లు. చదువుకుంటూనే ఒక రెస్టారెంట్‌లో పనిచేసేవారు.
అసలు ఆ రోజు ఏం జరిగింది?
పనిలో ఉన్నప్పుడు ఆమెకు కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. అది ఒక తీవ్రమైన అల్సర్ అని ఆమెకు తెలియదు. లోపల బ్లీడింగ్ మొదలైనప్పటికీ ఆమె గమనించలేదు. మరుసటి రోజు పరిస్థితి విషమించి, ఇంటికి చేరుకున్నాక స్పృహతప్పి పడిపోయారు. ఆమె భర్త వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేయడంతో ఆమె ప్రాణాలు దక్కాయి.
తాను స్పృహలో లేని సమయంలో ఒక అందమైన పర్వత ప్రాంతంలో ఉన్నట్లు అనిపించిందని పమేలా తెలిపారు. అక్కడ మంచుతో నిండిన కొండలు, పచ్చని లోయలు ఉన్నాయి. అక్కడి రంగులు, వాతావరణం మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉన్నాయని ఆమె చెప్పారు. తాను ఒక మానవ శరీరంలో కాకుండా, ఒక శక్తి (Energy)లో భాగమైనట్లు అనిపించిందని పేర్కొన్నారు. ఆ సమయంలో తన చుట్టూ అనేక జంతువులను, వాటి నుండి అపారమైన ప్రేమను పొందినట్లు ఆమె వివరించారు.
అప్పుడే ఆమెకు తన పెంపుడు కుక్క ‘హాలీ’ కనిపించింది. అది కొంతకాలం క్రితమే చనిపోయింది. దానిని చూడగానే ఆమె ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో అది అత్యంత అందమైన క్షణమని ఆమె చెప్పారు.
తిరిగి ప్రాణాల్లోకి ఎలా వచ్చారు?
దూరం నుండి తన భర్త తనను పిలుస్తున్నట్లు వినిపించిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత ఏదో శక్తి తనను వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆమె ఆసుపత్రిలో ఉన్నారు, డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఈ అనుభవం తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఆమె చెప్పారు. జీవితం అంటే మనం ఒకరితో ఒకరు ప్రేమతో కలిసి ఉండటమేనని, భయాన్ని వీడి ప్రేమను పంచడమే జీవిత పరమార్థమని ఆమె సందేశం ఇచ్చారు.
