“మహాత్మా గాంధీకి అంతర్జాతీయ గౌరవం!” గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2నే 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభం?!

2027లో జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌ను గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రణాళికలు రచిస్తోంది.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా ఈవెంట్‌ను.. ప్రపంచానికి శాంతి, అహింసలను అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభించడం సముచితంగా ఉంటుందని ఐసీసీ భావిస్తోంది.

మహాత్మా గాంధీ జీవితంలో, ఆయన సత్యాగ్రహ సిద్ధాంతాల ఆవిర్భావంలో దక్షిణాఫ్రికా దేశం అత్యంత కీలక పాత్ర పోషించింది. గాంధీజీ దాదాపు 21 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికాలోనే నివసించి, ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆ చారిత్రక బంధాన్ని గౌరవించడంతో పాటు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించే ఉద్దేశంతోనే ఈ ప్రారంభ తేదీని ఎంపిక చేయాలని ఐసీసీ యోచిస్తోంది.

వాస్తవానికి అక్టోబర్ మొదటి వారంలో వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించి, ప్రధాన టోర్నీని అక్టోబర్ 8న ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే గాంధీ జయంతి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, వార్మప్ మ్యాచ్‌లను మరింత ముందుగానే ముగించి, అక్టోబర్ 2 నుంచే లీగ్ మ్యాచ్‌లను ప్రారంభించేలా కొత్త షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 21న జరిగే అవకాశం ఉంది.

మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ 50 రోజుల క్రికెట్ పండుగ.. దక్షిణాఫ్రికాలోని 8 వేదికలతో కలిపి మొత్తం 12 స్టేడియాల్లో జరగనుంది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్రికా గడ్డపైకి మళ్లీ అడుగుపెడుతున్న ప్రపంచకప్‌ను బాపూజీ స్మరణతో ప్రారంభించాలనే ప్రతిపాదన భారత అభిమానులతో పాటు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లోనూ విశేష ఆదరణ పొందుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *