తమిళనాడులోని ఈరోడ్ జిల్లా తాళవాడి సమీపంలో గల ఒక ఫ్యాన్సీ స్టోర్లో పనిచేస్తున్న అంజు అనే వివాహితకు, నాగేంద్రన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే, గత కొంతకాలంగా అంజు అతనితో మాట్లాడటం మానేయడంతో నాగేంద్రన్ తీవ్ర ఆగ్రహానికి లోనై ఆమెపై పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలో పట్టపగలే ఆమె పనిచేస్తున్న ఫ్యాన్సీ స్టోర్లోకి చొరబడిన నాగేంద్రన్.. వెంట తెచ్చుకున్న కత్తితో అంజుపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో, వెంటనే తానూ వెంట తెచ్చుకున్న విషం తాగి అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హాహాకారాలు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. షాపులోకి చొరబడి వివాహితపై కత్తితో దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డై తీవ్ర కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
