మాతా వైష్ణో దేవి వెండి కానుకల్లో ‘నకిలీ’ ఆట: చేజారిన రూ. 520 కోట్లు.. బయటపడ్డ క్యాన్సర్ కారక లోహాలు!

మాతా వైష్ణో దేవి సన్నిధిలో భక్తులు సమర్పించిన వెండి కానుకల విషయంలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. ఈ మోసం వల్ల వైష్ణో దేవి శ్రైన్ బోర్డు ఆశిస్తున్న రూ. 520 కోట్ల ఆదాయం కాస్తా నీటిపాలైంది. కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే లోహాలను వెండిగా నమ్మించి విక్రయించిన కుట్ర కూడా బయటపడింది.

అసలేం జరిగింది? గత కొన్నాళ్లుగా భక్తులు అమ్మవారికి సమర్పించిన వెండి కానుకలను కరిగించి, స్వచ్ఛమైన వెండిగా మార్చడానికి శ్రైన్ బోర్డు ప్రభుత్వ టంకశాల (Mint)కు పంపింది. సుమారు 20 టన్నుల వెండి వస్తువులను బోర్డు పంపగా, టంకశాల ఇచ్చిన నివేదిక అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

  • బోర్డు పంపిన 20 టన్నుల బరువులో కేవలం 5 నుండి 6 శాతం మాత్రమే అసలైన వెండి ఉంది.
  • మిగిలినదంతా క్యాడ్మియం, ఇనుము మరియు జింక్ వంటి చౌకబారు లోహాలేనని టంకశాల స్పష్టం చేసింది.
  • ఈ 20 టన్నుల వెండి ద్వారా సుమారు రూ. 550 కోట్లు లభిస్తాయని బోర్డు అంచనా వేయగా, వాస్తవానికి అందులో కేవలం రూ. 30 కోట్ల విలువైన వెండి మాత్రమే తేలింది.

వెండి నాణేలలో ‘క్యాన్సర్’ కారకాలు: భక్తులు కట్రాలోని దుకాణాలలో లేదా యాత్ర మార్గంలో కొనుగోలు చేసిన వెండి గొడుగులు (ఛత్రాలు), నాణేలు నాణ్యత లేనివని దర్యాప్తులో తేలింది. ఈ నకిలీ వెండి వస్తువుల తయారీలో క్యాడ్మియం అనే విషపూరిత లోహాన్ని వాడారు.

  • క్యాడ్మియం: ఇది వెండి లాగే మెరుస్తుంది కానీ అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది. దీని వినియోగంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పూర్తిగా నిషేధం విధించింది. దీన్ని కరిగించినప్పుడు వచ్చే పొగ ఊపిరితిత్తులు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • ఇనుము మరియు జింక్: బరువు పెంచడానికి ఇనుమును, తయారీ ఖర్చు తగ్గించడానికి జింక్‌ను వాడారు.

శుద్ధి చేయడానికి నిరాకరించిన టంకశాల: ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని భావించి, ఆ కానుకలను కరిగించడానికి టంకశాల సిబ్బంది నిరాకరించారు. వెండి ఎక్కువగా ఉన్న భాగాలను చేతులతో వేరు చేయడానికి సిబ్బందికి సుమారు మూడు నెలల సమయం పట్టింది.


మోసపోకుండా ఉండాలంటే భక్తులు ఏం చేయాలి?
  • బిఐఎస్ గుర్తింపు: వెండి స్వచ్ఛత కోసం BIS నిర్దేశించిన 999 లేదా 925 కోడ్‌లను గమనించాలి.
  • HUID నంబర్: వెండి వస్తువులపై ఉండే 6 అంకెల HUID నంబర్‌ను ‘BIS Care App’ లో నమోదు చేసి ఆ వస్తువు స్వచ్ఛతను, జ్యువెలర్ వివరాలను తనిఖీ చేయవచ్చు.
  • అధికారిక దుకాణాలు: వెండి నాణేలు లేదా గొడుగులు కొనాలనుకుంటే.. కట్రా, అర్ధకుమారి లేదా భవన్ వద్ద ఉన్న వైష్ణో దేవి శ్రైన్ బోర్డు అధికారిక దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయండి.

Posted

in

by

Tags: