పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్‌లో మాదకద్రవ్యాల (డ్రగ్స్) విక్రయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన జక్సీర్ సింగ్ అలియాస్ ‘జక్కా’, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందే విషం తాగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
అనంతరం అతను విడుదల చేసినట్లుగా భావిస్తున్న ఒక వీడియో కూడా ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ వీడియోలో, తన గ్రామంలో జోరుగా డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయని, దీనిపై తాను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నానని జక్కా పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి ఫిర్యాదులోని ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జక్కా తెలిపిన వివరాల ప్రకారం.. నమొల్ గ్రామంలో జరుగుతున్న మాదకద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన ఒక వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను కాంగ్రెస్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరాకు కూడా చూపించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేయబడిందని, అనంతరం గ్రామ సర్పంచ్ సుఖ్‌చైన్ సింగ్ తుపాకీతో తన ఇంటికి వచ్చి బెదిరించాడని జక్కా ఆరోపించాడు. అంతేకాకుండా తన ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని తెలిపాడు.
ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఉన్న డీవీఆర్ (DVR)ను పోలీసులకు అప్పగించినట్లు జక్కా తెలిపాడు. అయితే ఆ డీవీఆర్ ఖాళీగా ఉందని పోలీసులు చెప్పి తదుపరి చర్యలేవీ తీసుకోలేదని అతను ఆరోపించాడు. అలాగే పంజాబ్ మంత్రి అమన్ అరోరాను కలిసి డ్రగ్స్ వీడియోను చూపించేందుకు ప్రయత్నించగా, ఆయనను కలవలేకపోయానని, డీఎస్పీని ఆ తర్వాత ఎస్హెచ్ఓ (SHO)ను సంప్రదించాల్సిందిగా సూచించారని పేర్కొన్నాడు. ఫిర్యాదులపై సరైన స్పందన రాకపోవడంతో గ్రామంలో పంచాయతీని కూడా ఏర్పాటు చేసినట్లు జక్కా తెలిపాడు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జక్కా, సంగ్రూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విషపూరిత ద్రవాన్ని తాగినట్లు పోలీసులు, మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం విషమించడంతో వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పటియాలాలోని ఆసుపత్రికి మార్చినట్లు సమాచారం. జక్కా చేసిన ఆరోపణలపై ఫిర్యాదు స్వీకరించామని, సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు.

Leave a Reply