మార్చి 11: ఛత్రపతి శంభాజీ మహారాజ్ బలిదాన్ దివస్.. మతం మార్చడం కోసం మొఘలులు అంగవైకల్యం చేసినా, ప్రతి గాయం నుంచి వినిపించిన స్వరం “జై భవానీ”

న్యూఢిల్లీ: చరిత్రను వక్రీకరించిన కొందరు చరిత్రకారుల కారణంగా, ఆక్రమణదారుడు ఔరంగజేబు గుణగానాలు వినబడ్డాయే తప్ప, ధర్మ రక్షకుడు శంభాజీ మహారాజ్ పరాక్రమం వెలుగులోకి రాలేదు. భారత భూమిపై హిందూ ధర్మ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులలో శంభాజీ మహారాజ్ ఒక వెలకట్టలేని మాణిక్యం.

వీరత్వానికి మారుపేరు – శంభు రాజే
ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడైన శంభాజీ, మే 14, 1657న జన్మించారు. 1680లో శివాజీ మహారాజ్ మరణానంతరం హిందూ సామ్రాజ్య బాధ్యతలను స్వీకరించారు. కేవలం 9 ఏళ్ల స్వల్ప పాలనలో ఆయన 120 యుద్ధాలు చేసి, ఒక్కటి కూడా ఓడిపోకపోవడం ఆయన యుద్ధ తంత్రానికి నిదర్శనం. శంభాజీ గుర్రపు డెక్కల శబ్దం వింటేనే మొఘల్ సైనికుల చేతుల్లోని ఆయుధాలు జారిపడేవట.

ఔరంగజేబు సింహస్వప్నం
శంభాజీ మహారాజ్ పరాక్రమానికి భయపడిన ఔరంగజేబు, ఆయనను పట్టుకునే వరకు తన తలపై కిరీటాన్ని ధరించనని ప్రతిజ్ఞ చేశాడు. శివాజీ మహారాజ్ తర్వాత కూడా హిందూ స్వరాజ్యాన్ని అజేయంగా ఉంచిన ఘనత శంభాజీదే. ఒకానొక సందర్భంలో ఔరంగజేబు కొడుకు అక్బర్ స్వయంగా శంభాజీని ఆశ్రయించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.

ద్రోహం మరియు బంధీ
దురదృష్టవశాత్తూ, సొంత మనుషుల ద్రోహం వల్లే శంభాజీ మొఘలులకు చిక్కారు. 1689లో సంగమేశ్వర్ వద్ద కేవలం 200 మంది సైనికులతో ఉన్న సమయంలో, ఆయన బావ గణోజీ షిర్కే మొఘల్ సర్దార్ ముకర్రబ్ ఖాన్‌కు రహస్య మార్గాన్ని చూపాడు. దీంతో 5,000 మంది మొఘల్ సైన్యం ఒక్కసారిగా దాడి చేసి శంభాజీని, ఆయన మిత్రుడు కవికలశ్‌ను బంధీలుగా పట్టుకున్నారు.

అమానవీయ హింస – అచంచల ధర్మనిష్ఠ
ఔరంగజేబు శంభాజీని ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేశాడు. అలా చేస్తే ప్రాణభిక్ష పెడతానని ఆశ చూపాడు. కానీ శంభాజీ మహారాజ్ ఆ ప్రతిపాదనను ఛీత్కరించుకున్నారు. ఆగ్రహించిన ఔరంగజేబు క్రూరత్వానికి హద్దులు దాటాడు:

వారి నాలుకలు కోయించాడు, కళ్లు పీకించాడు.

రోజుకో అవయవాన్ని నరికి చిత్రహింసలకు గురిచేశాడు.

చివరకు మార్చి 11, 1689న శంభాజీ మహారాజ్ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి చంపించాడు.

మరణానికి ముందు ఔరంగజేబు ఒక మాట అన్నాడు: “నా నలుగురు కొడుకుల్లో ఒక్కడు నీలాంటి వాడున్నా, ఈ పాటికి మొత్తం హిందుస్థాన్ మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయేది.”

అంతిమ సంస్కారం
తులాపూర్ నదిలో పారేసిన ఆయన శరీర భాగాలను స్థానిక ప్రజలు (వీరిని నేడు ‘శివలే’ అని పిలుస్తారు) సేకరించి, కుట్టి, శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శంభాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం అంతమవుతుందని ఔరంగజేబు భావించాడు, కానీ ఆయన త్యాగం మరాఠాలందరినీ ఏకం చేసింది. ఫలితంగా ఔరంగజేబు దక్కన్ ప్రాంతంలోనే ప్రాణాలు వదలాల్సి వచ్చింది.

నేటికీ ధర్మ రక్షణ కోసం శంభాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి హిందువుకు స్ఫూర్తిదాయకం.


Posted

in

by

Tags: