బాలి: ఇండోనేషియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బాలిలో ఒక రష్యన్ పర్యాటకుడు మద్యం మత్తులో హద్దు మీరి ప్రవర్తించాడు. స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతడిని ఒక బాక్సర్ తనదైన శైలిలో అదుపు చేసి బుద్ధి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది? బాలిలోని ఉలువట్టు బీచ్ సమీపంలో ఉన్న ఒక క్లబ్‌కు వచ్చిన రష్యన్ పర్యాటకుడు అతిగా మద్యం సేవించాడు. మత్తులో రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డుకోవడం, అటుగా వెళ్తున్న మహిళలను అనుమతి లేకుండా తాకడం వంటి పనులు చేస్తూ నానా హంగామా చేశాడు. అక్కడి మహిళల పట్ల అనాగరికంగా ప్రవర్తిస్తున్న సమయంలో స్థానిక జిమ్ యజమాని, బాక్సర్ అయిన బెల్టా బ్రిక్ సాంటో రంగంలోకి దిగాడు.
దెబ్బ కొట్టకుండానే దెబ్బ తీశాడు: సదరు పర్యాటకుడు ఎంతకీ వినకపోవడంతో సాంటో అతడిని కొట్టకుండా, వెనుక నుండి గొంతు పట్టి గట్టిగా నొక్కి పట్టుకున్నాడు (Chokehold). ఆ పట్టు నుండి విడిపించుకోవడానికి రష్యన్ పర్యాటకుడు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. గాలి ఆడక ఒక దశలో అతను స్పృహ తప్పి పడిపోయాడు. చుట్టుపక్కల వారు “అతను పడిపోయాడు, వదిలేయండి” అని అరిచిన తర్వాత సాంటో తన పట్టును వదిలాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన పర్యాటకుడు భయంతో వణికిపోతూ “నాకు అర్థమైంది (క్షమించండి)” అని వేడుకున్నాడు.
బాక్సర్ వివరణ: ఈ ఘటనపై సాంటో స్పందిస్తూ.. “అతడిని కొట్టడం నాకు ఇష్టం లేదు. కానీ స్థానిక మహిళలను, ప్రజలను అతను ఇబ్బంది పెడుతున్న తీరు చూసి బుద్ధి చెప్పాలనుకున్నాను. బాలికి వచ్చే పర్యాటకులు ఇక్కడి సంస్కృతిని, ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి” అని స్పష్టం చేశాడు.
బాలిలో పెరుగుతున్న అరాచకాలు: ఇటీవల బాలిలో పర్యాటకుల అనాగరిక ప్రవర్తన ఎక్కువవుతోంది. గత మార్చి 19న బాలి పవిత్ర దినమైన ‘న్యేపి’ (నిశ్శబ్ద దినం) నాడు నిబంధనలు ఉల్లంఘించిన అమెరికా పర్యాటకునిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో బాలి ప్రభుత్వం 2025 నుండి కొత్త ప్రవర్తనా నియమావళిని అమలులోకి తెచ్చింది. స్థానిక సంస్కృతిని, మతపరమైన మనోభావాలను గౌరవించని పర్యాటకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
