మిలన్ వింటర్ ఒలింపిక్స్: 3 రోజుల్లోనే 10,000 కాండమ్స్ ఖాళీ; ఒలింపిక్ కమిటీ సమాధానం ఏంటి?

ఇటలీలోని మిలన్-కోర్టినా (Milan-Cortina) ప్రాంతంలో 2026 శీతాకాల ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఒలింపిక్ విలేజ్‌లో క్రీడాకారుల కోసం అత్యాధునిక జిమ్, టేబుల్ ఫుట్‌బాల్, ఎయిర్ హాకీ, పియానో మరియు ఉచిత శీతల పానీయాల యంత్రాలు వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. వీటితో పాటు సంప్రదాయం ప్రకారం క్రీడాకారులకు ఉచితంగా కాండమ్స్ (Condoms) కూడా పంపిణీ చేస్తారు.

అందులో భాగంగా, క్రీడాకారుల కోసం ప్రాథమికంగా 10,000 ఉచిత కాండమ్స్ అందుబాటులో ఉంచారు. అయితే ఒలింపిక్ పోటీలు ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే ఈ 10,000 కాండమ్స్ అయిపోయినట్లు సమాచారం వెలువడింది.

ఒలింపిక్ కమిటీ సమాధానం: దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రతినిధి మార్క్ ఆడమ్స్ విలేకరులతో సరదాగా మాట్లాడారు. “ఒలింపిక్ విలేజ్‌లో వాలెంటైన్స్ వీక్ వేడుకలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇది తెలియజేస్తోంది. అక్కడ 2,800 మంది క్రీడాకారులు ఉన్నారు, 10,000 కాండమ్స్ ఖాళీ అయ్యాయి. లెక్క మీరే వేసుకోండి. ఒలింపిక్ చార్టర్ రూల్ 62 ప్రకారం, కాండమ్స్ పంపిణీ చేయడం తప్పనిసరి” అని ఆయన వ్యాఖ్యానించారు.

అంచనా వేసిన దానికంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, అదనపు స్టాక్ కోసం ఏర్పాట్లు చేశామని, సోమవారం నాటికి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఒలింపిక్స్ ముగిసే వరకు కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై మెక్సికోకు చెందిన స్కీయర్ డోనోవన్ కరిల్లో స్పందిస్తూ, “అందరిలాగే నేను కూడా ఆశ్చర్యపోయాను” అని అన్నారు.

గత 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సుమారు 3 లక్షల కాండమ్స్ (ఒక క్రీడాకారుడికి రోజుకు రెండు చొప్పున) పంపిణీ చేశారు. కానీ ఈసారి 3,000 కంటే తక్కువ మంది క్రీడాకారులే పాల్గొంటున్నందున 10,000 సరిపోతాయని నిర్వాహకులు భావించారు. కానీ వారి అంచనా తప్పడంతో అధికారులు విస్తుపోయారు.


Posted

in

by

Tags: