మన శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రక్తాభిసరణ మరియు జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి తగినంత నీటి శాతం (హైడ్రేషన్) చాలా అవసరం.
సాధారణంగా మనకు దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతాము. కానీ, దాహం వేయడానికి ముందే మన శరీరం కొన్ని ముఖ్యమైన సంకేతాల ద్వారా నీటి అవసరాన్ని మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది.
శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి తేలికైన మార్గం మూత్రం రంగును పరీక్షించడమే. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉందని, ముదురు పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉంటే శరీరంలో నీటి శాతం చాలా తక్కువగా ఉందని అర్థం. ఈ పరిస్థితి ఉంటే వెంటనే నీళ్లు తాగాలి.
ఎలాంటి కారణం లేకుండా తరచూ తలనొప్పి వస్తోందా? మెదడు చుట్టూ ఉండే ద్రవం పరిమాణం తగ్గనప్పుడు తలనొప్పి వస్తుంది. కాబట్టి టాబ్లెట్ వేసుకోవడానికి బదులుగా ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగి చూడటం మంచి ఫలితాన్నిస్తుంది. అలాగే పెదవులు తడి ఆరిపోవడం, చర్మం కాంతిహీనంగా మారడం, కారణం లేని అలసట మరియు ఏకాగ్రత కుదరకపోవడం వంటివి కూడా నీటి శాత లోపానికి (డీహైడ్రేషన్) సంకేతాలే.
అంతేకాకుండా నోరు ఎండిపోవడం, నోటి దుర్వాసన, కండరాల పట్టు (మజిల్ క్రాంప్స్), తలతిరగడం మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా శరీరంలో నీటి శాతం మరియు ఎలక్ట్రోలైట్ల సమతుల్యత తగ్గడం వల్లే సంభవిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో లేదా వ్యాయామం చేసేటప్పుడు కండరాల పట్టేయడం అనేది శరీరానికి నీటి అవసరాన్ని గుర్తుచేస్తుంది.
కేవలం నీటిని మాత్రమే తాగడం నచ్చనివారు పుచ్చకాయ, దోసకాయ, ఆరంజ్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు. మన శరీరం ఇచ్చే ఇటువంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, ప్రతిరోజూ సరిపడా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Leave a Reply