నేడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటం వల్ల, అది కొన్నిసార్లు దుర్వినియోగం అవుతున్నప్పటికీ.. మరికొన్నిసార్లు అవినీతిపరులు, మోసగాళ్లు, దోపిడీదారులు మరియు అన్యాయం చేసేవారి గుట్టు రట్టు చేయడంలో కీలక సాక్ష్యంగా మారుతోంది. అయితే, తాము చేసే అన్యాయాన్ని ప్రజలు వీడియో తీయడమే తప్పు అన్నట్లుగా హైకోర్టులో వాదించి, న్యాయమూర్తుల చేతిలో ప్రభుత్వం చివాట్లు తిన్న ఆసక్తికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వానికి చెమటలు పట్టించిన కోర్టు
గుజరాత్ హైకోర్టులో ఈ ఘటన చోటుచేసుకోగా, దీనికి సంబంధించిన కోర్టు విచారణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ లోపల పౌరులు వీడియో తీయడాన్ని నిషేధించినందుకు పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇలా చేయడం సరికాదని, వారికి వీడియో తీసే అధికారం లేదని వాదించిన ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు చురకలు అంటించింది.
ఎన్ని సిసిటివిలు పనిచేస్తున్నాయి?
స్టేషన్లలో సిసిటివి (CCTV) కెమెరాలు ఉన్నప్పుడు, ప్రజలు ఇలా లోపలికి వచ్చి వీడియోలు తీయడం సరికాదని, అది చట్టవిరుద్ధమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. “సరే, మీ వాదననే ఒప్పుకుందాం.. ముందుగా అలా వీడియో తీయకూడదని ఏ చట్టం, ఏ సెక్షన్ చెబుతుందో చూపండి” అని న్యాయమూర్తి ప్రశ్నించగా న్యాయవాది నీళ్లు నమలాల్సి వచ్చింది. సిసిటివిలు ఉండగా వీడియోలు ఎందుకు అని ప్రశ్నించినప్పుడు.. “ప్రభుత్వ ఆఫీసుల్లో ఎన్ని సిసిటివిలు పనిచేస్తాయో మాకు తెలుసు. 80 శాతం కెమెరాలు అసలు పనిచేయవు. అలాంటప్పుడు సాక్ష్యం కోసం ప్రజలు వీడియో తీయడంలో తప్పేముంది?” అని జడ్జి ప్రశ్నించారు. “మీరు (పోలీసులు) ఏ అన్యాయమైనా చేయవచ్చు, కానీ ప్రజలు దానిని ప్రశ్నించకూడదా? ఇది ఏ చట్టంలో ఉందో చూపండి” అని అడిగేసరికి ప్రభుత్వ న్యాయవాది మౌనంగా ఉండిపోయారు.
గతంలోనూ ఇవే తీర్పులు
ఈ అంశం కొత్తదేమీ కాదు. 2022లో బాంబే హైకోర్టు ‘రవీంద్ర శీతల్ రావ్ ఉపాధ్యాయ వర్సెస్ మహారాష్ట్ర స్టేట్’ కేసులో కీలక తీర్పునిచ్చింది. అధికారిక రహస్యాల చట్టం (Official Secrets Act) ప్రకారం పోలీస్ స్టేషన్లు “నిషేధిత ప్రాంతాలు” (Prohibited Places) కావని కోర్టు స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్ లోపల రహస్యంగా చిత్రీకరించడం ఆ చట్టం కింద నేరం కాదని, ఎందుకంటే అది గూఢచారి వర్గంలోకి రాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
