కరెంట్ పోయినప్పుడు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించే ముఖ్యమైన సాధనంగా ఇన్వర్టర్ పనిచేస్తుంది.
అయితే, ఇన్వర్టర్ మరియు దాని బ్యాటరీ చుట్టూ కొన్ని వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచడం వల్ల అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్ మరియు బ్యాటరీ పేలిపోయే ప్రమాదాలు సంభవించవచ్చు. ముఖ్యంగా బ్యాటరీ ఛార్జ్ అయ్యే సమయంలో వేడి ఉత్పన్నమవుతుంది కాబట్టి, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి.
ఇన్వర్టర్ దగ్గర కాగితాలు, వార్తాపత్రికలు, కార్డ్బోర్డ్ పెట్టెలు మరియు పాత బట్టలను అస్సలు ఉంచకూడదు. ఇవి ఇన్వర్టర్ నుంచి వెలువడే వేడి బయటకు పోకుండా అడ్డుకుని, పరికరం మరింత వేడెక్కేలా చేయడమే కాకుండా.. చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ జరిగినా సులభంగా మంటలు అంటుకునే ప్రమాదాన్ని పెంచుతాయి.
అలాగే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పెయింట్ థిన్నర్ వంటి త్వరగా మండిపోయే ద్రవాలను, డియోడరెంట్లు మరియు దోమల స్ప్రే డబ్బాలను దీనికి సమీపంలో ఉంచకూడదు. వేడి పెరిగినప్పుడు ఈ స్ప్రే క్యాన్లు పేలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, స్థలం సరిపోలేదనే కారణంతో ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్‌ను ఇన్వర్టర్ పక్కన పెట్టడం పెను ప్రమాదానికి దారితీస్తుంది.
చెక్క పెట్టెలు, స్టోరేజ్ వస్తువులను ఇన్వర్టర్ చుట్టూ ఇరుగ్గా పేర్చి ఉంచితే గాలి ప్రసరణ దెబ్బతింటుంది. అదేవిధంగా వాటర్ క్యాన్లు, తడి బట్టలను కూడా వీటికి దూరంగా ఉంచాలి. తేమ వల్ల ఎలక్ట్రానిక్ విడిభాగాలు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమున్నందున, బ్యాటరీ ఉండే ప్రదేశాన్ని ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
ఇన్వర్టర్ను ఎప్పుడూ మూసివున్న కప్బోర్డులలో కాకుండా, ధారాళంగా గాలి ఆడే విశాలమైన ప్రదేశంలో అమర్చుకోవాలి. వైర్లు మరియు బ్యాటరీ కనెక్షన్లను నెలకు ఒకసారి తనిఖీ చేసుకోవడం, ఎక్స్టెన్షన్ బోర్డులను వాడకుండా నేరుగా గోడ సాకెట్‌కు మాత్రమే ప్లగ్ చేయడం వల్ల అగ్ని ప్రమాదాల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు.

Leave a Reply