బెంగళూరులోని మైసూర్ రోడ్డులో అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం రాత్రి మద్యం మత్తులో బైక్ నడుపుతున్న ఒక యువకుడు ట్రాఫిక్ పోలీసులను బెదిరించి, బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించడమే కాకుండా.. తన సొంత బైక్కు నిప్పు పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు.
అసలేం జరిగింది?
బ్యాటరాయనపుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘కవికా జంక్షన్’ వద్ద రాత్రి 10:35 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు ఒక ద్విచక్ర వాహనదారుడిని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకోమని కోరారు. దానికి అతను నిరాకరించి పోలీసులతో గొడవకు దిగాడు.
నిందితుడిని బిటిఎం లేఅవుట్ 1వ దశకు చెందిన వెంకటేష్ అని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం, అతను మద్యం మత్తులో ఉండటంతో పరీక్ష చేయాలని కోరగా.. అతను పోలీసులపైనే దాడికి యత్నించాడు. గొడవ పడుతున్న సమయంలో “మీ పరీక్షల్లో పాస్ అవ్వడం కంటే చావడం లేదా నా బైక్ను తగలబెట్టడం మేలు” అని అరుస్తూ హల్చల్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని, బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించారు.
అధిక మోతాదులో మద్యం:
పోలీస్ స్టేషన్లో పరీక్ష నిర్వహించగా, వెంకటేష్ శరీరంలో ఆల్కహాల్ స్థాయి 100 మి.లీ. రక్తంలో 367 మి.గ్రా. ఉన్నట్లు తేలింది. ఇది అనుమతించదగిన స్థాయి కంటే చాలా రెట్లు ఎక్కువ. అధికారులు అతడికి నోటీసు జారీ చేయగా, మళ్ళీ పోలీసులపై కేకలు వేశాడు. అనంతరం స్టేషన్ బయటకు వచ్చి, తన బైక్ ట్యాంకులోని పెట్రోల్ తీసి నిప్పు పెట్టాడు. బైక్ కాలిపోతుండగానే అక్కడి నుండి పరారయ్యాడు.
వెంకటేష్ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడటం ఇది రెండోసారి అని పోలీసులు తెలిపారు. పదే పదే జరిమానాలు పడుతుండటంతో విసుగు చెంది, ఆవేశంలో ఈ పని చేశాడని, ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడని అధికారులు వెల్లడించారు.
