సోషల్ మీడియాలో మైనర్లు వాహనాలు నడపడంపై తరచూ చర్చలు జరుగుతున్నప్పటికీ, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 15 ఏళ్ల మైనర్ బాలుడు నడిపిన కారు మరో వాహనాన్ని బలంగా ఢీకొన్న ఘటన సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగనప్పటికీ, ఆ సమయంలో ప్రమాదానికి గురైన కారులో ఓ పసికందు ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
నోయిడాలో రోడ్డుపై వాహనాలు వెళ్తున్న సమయంలో 15 ఏళ్ల బాలుడు కారును వేగంగా నడుపుతూ అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆ కారు తీవ్రంగా దెబ్బతింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆ బాలుడు ఆగకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు, బాధితుడు ఆ కారును వెంబడించి అడ్డుకున్నారు. కొద్దిసేపటికే ఆ బాలుడి తల్లి కూడా అక్కడికి చేరుకుంది.
ప్రమాదానికి గురైన కారు యజమాని “చిన్న పిల్లాడి చేతికి కారు ఎలా ఇస్తారు?” అని ఆగ్రహంతో నిలదీశారు. దానికి ఆ బాలుడి తల్లి.. “రోజూ వచ్చే మా డ్రైవర్ ఈరోజు రాలేదు. అత్యవసరంగా కుటుంబంలో ఒకరిని తీసుకురావాల్సి రావడంతో, వేరే దారి లేక నా కొడుకునే కారు నడపమన్నాను” అంటూ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.
డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని స్థానికులు ప్రశ్నించగా, తమ వద్ద లైసెన్స్ లేదని తల్లీకొడుకులు అంగీకరించారు. కారులో ఉన్న పసిపాపతో సహా ఇతరుల ప్రాణాలు పోయేంత ప్రమాదం జరిగినా తల్లి అంత పొగరుగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. “ముందు ఇలాంటి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, అప్పుడే ఇలాంటి తప్పులు తగ్గుతాయి” అని ఒకరు ఘాటుగా స్పందించారు. “మైనర్ కాబట్టి చట్టం నుంచి తప్పించుకుంటాడు, కానీ ఆ తల్లికి జనం తగిన గుణపాఠం చెప్పాలి” అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. “చిన్న పిల్లాడికి కారు ఎలా ఇస్తారు? ఆ బిడ్డకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ఇంకొకరు ప్రశ్నించారు.
నిబంధనలు ఉల్లంఘించి మైనర్లకు వాహనాలు ఇవ్వడం కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాదని, రోడ్లపై వెళ్లే అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

Leave a Reply