ముంబై: మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో షేర్డ్ ఆటో రిక్షా విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం ముంబైలోని కురార్ ప్రాంతంలో పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ముస్లిం వ్యక్తుల బృందం హిందూ యువతులపై దాడి చేయడంతో ఈ పరిస్థితి హింసాత్మకంగా మారింది. దీనిపై పోలీసులు చర్యలు చేపట్టగా, రాజకీయంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగింది? మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో నలుగురు గుజరాతీ యువతులు షేర్డ్ ఆటో కోసం లైన్‌లో నిలబడినప్పుడు, ముస్లిం మహిళలతో వివాదం తలెత్తింది. ‘సుప్రీం సమాచార్’ నివేదిక ప్రకారం.. ఒక గుజరాతీ హిందూ కుటుంబం షాపింగ్ కోసం మలాడ్ వెళ్లి ఆటో లైన్‌లో నిలబడ్డారు. ఆ యువతులు లైన్‌లో ముందున్నప్పటికీ, బుర్ఖా ధరించిన మహిళలు తాము ముందు వెళ్లాలని గొడవకు దిగారు.
మొదట మాటల యుద్ధం జరిగినప్పటికీ, అందరూ వేర్వేరు ఆటోల్లో అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే, కురార్‌లోని పఠాన్‌వాడి ప్రాంతానికి చేరుకున్నాక, మరికొంతమందిని అక్కడికి పిలిపించడంతో వివాదం ముదిరింది. ఇస్లాంపురాకు చెందిన 20 మంది ముస్లిం వ్యక్తులు నలుగురు యువతులను చుట్టుముట్టి దాడి చేశారని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. దీనిని ‘మాబ్ లించింగ్’ (మతోన్మాద గుంపు దాడి) గా అభివర్ణిస్తూ.. “మీరు నిజంగా మగవారైతే, యువతులపై దాడి చేయడానికి 20 మంది ఎందుకు గుమిగూడారు?” అని ఆయన ప్రశ్నించారు.
బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి నిరుపమ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం నివాసితులతో కలిసి ఘటనా స్థలంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన చేపట్టారు. ఒక చిన్న వివాదంపై యువతులను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు ఇద్దరు మహిళలు, ఒక పురుషుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. కురార్ పోలీసుల నివేదిక ప్రకారం.. నిందితులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారని, అయితే రాబోయే 24-48 గంటల్లో ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని నిరుపమ్ తెలిపారు.
