న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాలైన ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (SC) హోదాను కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగం ప్రకారం నోటిఫై చేయబడిన లేదా గుర్తింపు పొందిన కులం లేదా తెగకు ఆ వ్యక్తి చెంది ఉండాలని కోర్టు పేర్కొంది. దీని కోసం 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులోని సెక్షన్ 3 లో ఉన్న నిబంధనలను సుప్రీంకోర్టు ఉదహరించింది. ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సుప్రీంకోర్టు ఆదేశం ఏమిటి? ముస్లిం లేదా క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తిని ఇకపై షెడ్యూల్డ్ కుల సభ్యునిగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. 1950 ఉత్తర్వులోని సెక్షన్ 3 ప్రకారం ఉన్న పరిమితులు పూర్తిగా వర్తిస్తాయని పేర్కొంది. సెక్షన్ 3లో పేర్కొన్న మతాలు (హిందూ, సిక్కు, బౌద్ధం) కాకుండా ఇతర మతాల్లోకి మారిన వెంటనే, వారు ఏ కుటుంబంలో జన్మించినా వారి ఎస్సీ హోదా తక్షణమే రద్దవుతుంది. ఒకవేళ ఎవరైనా తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి వస్తే, వారి పాత హోదాను తిరిగి పొందడానికి కొన్ని షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
1950 నాటి ఉత్తర్వు ఏమిటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కింద షెడ్యూల్డ్ కులాలను చేర్చారు. దీని ప్రకారం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలను అనుసరించేవారిని మాత్రమే ఎస్సీలుగా గుర్తిస్తారు. 1950లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దళితులలో ఈ మూడు మతాలకు చెందిన వారికే రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతాయి.
బాలకృష్ణన్ కమిషన్ విచారణ: మత మార్పిడి చేసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించవచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లు కులం ప్రాతిపదికన ఉంటాయి కాబట్టి, మతం మారిన తర్వాత వారి సామాజిక స్థితిగతుల్లో వచ్చే మార్పులను ఈ కమిషన్ అధ్యయనం చేస్తోంది. మతం మారిన వారికి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని జాతీయ ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు కిషోర్ మక్వానా అభిప్రాయపడ్డారు.
