ఐపీఎల్ టోర్నీ క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే, మరోవైపు క్రికెట్ అభిమానులకు ఒక దిగ్భ్రాంతికర వార్త వినిపించింది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ పేసర్ షాపూర్ జద్రాన్, న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసీయూ (ICU) విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఒక అరుదైన వ్యాధి ఈ క్రికెటర్ జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది.
ఐసీయూలో విషమంగా క్రికెటర్ పరిస్థితి
షాపూర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన ‘హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం షాపూర్ వ్యాధి 4వ స్టేజ్ దాటినట్లు సమాచారం. దీంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
జనవరి నుండే పోరాటం
జనవరి నెలలో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన షాపూర్ నిరంతరం చికిత్స పొందుతున్నారు. జనవరి 18 నుండి ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రారంభ దశలో షాపూర్ నెమ్మదిగా కోలుకున్నారు, ఫిబ్రవరిలో ఆరోగ్యం మెరుగుపడింది. కానీ ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడంతో ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈ ఇన్ఫెక్షన్ మెదడుకు కూడా పాకడంతో ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
ఆఫ్ఘన్ క్రికెటర్ కోసం స్పందించిన బీసీసీఐ
2025 అక్టోబర్ నుండే షాపూర్ ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లో చికిత్స పొందినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు. దీనికి ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా మద్దతు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు రషీద్ ఖాన్ విజ్ఞప్తి మేరకు ఐసీసీ (బీసీసీఐ కార్యదర్శి) జై షా స్పందించారు. రషీద్ ఖాన్ తన ఐపీఎల్ ఫ్రాంచైజీని కూడా కోరడంతో, షాపూర్ చికిత్స కోసం భారత్ తక్షణమే వీసా మరియు ఇతర సౌకర్యాలను కల్పించింది.
ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్న షాపూర్ ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షాపూర్ త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ప్రార్థిస్తున్నారు.
