ఉదయం 10 గంటల సమయం.. లేలేత ఎండలో పొలంలో కూర్చుని టిఫిన్ తింటున్న ఒక రైతు కూలీపై మృత్యువు పంజా విసిరింది. వెనుక నుండి వచ్చిన చిరుతపులి ఆ కూలీ మెడపై దాడి చేసింది. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ వ్యక్తి, చిరుత మధ్య భీకర పోరాటం జరిగింది.
ఈ పెనుగులాటలో ఇద్దరూ పక్కనే ఉన్న రక్షణ గోడ లేని 40 అడుగుల లోతైన బావిలో పడిపోయారు. ముక్కు, నోట్లోకి నీరు చేరుతున్నా ఆ చిరుత మాత్రం ఆ కూలీ మెడను వదల్లేదు.
టిఫిన్ తింటుండగా కాటేసిన కాలం
గోరఖ్ లక్ష్మణ్ జాదవ్ అనే కూలీ ఎప్పటిలాగే పొలంలో పనికి వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో పని నుండి కొద్దిగా విరామం తీసుకుని అల్పాహారం తింటున్నారు. సరిగ్గా అదే సమయంలో పొదల్లో మాటు వేసిన చిరుత ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఏమాత్రం ఆలోచించే లోపే గోరఖ్ చిరుత దవడల మధ్య చిక్కుకుపోయారు. రక్తం కోసం దాహంతో ఉన్న ఆ క్రూరమృగం మెడను గట్టిగా పట్టుకోగా, ప్రాణాల కోసం గోరఖ్ పోరాడటం మొదలుపెట్టారు.
బావిలో మరణంతో పోరాటం
ఇద్దరి మధ్య జరిగిన పోరాటంలో అదుపు తప్పి పక్కనే ఉన్న బావిలోకి పడిపోయారు. ఆ బావికి రక్షణ గోడ లేకపోవడం శాపమైంది. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ మునగసాగారు. పొలంలో ఉన్న మహిళలు కేకలు వేయడంతో గ్రామస్తులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ వారు చూసిన దృశ్యం గుండెలను పిండేసింది.
కళ్లారా చూసిన వారు ఏమన్నారంటే?
బావిలో ఉన్న విద్యుత్ మోటార్ పంపు ఫౌండేషన్ను ఆధారం చేసుకుని చిరుత కూర్చుని ఉంది. అప్పటికి కూడా అది గోరఖ్ మెడను తన దవడల నుండి వదల్లేదు. “నేను పరుగెత్తుకుంటూ వచ్చేసరికి చిరుత ఇంకా అతని మెడను వదల్లేదు, పంజాతో రక్కుతోంది” అని పొలం యజమాని గణపత్ చవాన్కే కన్నీటితో చెప్పారు. కొద్దిసేపటి తర్వాత చిరుత పట్టు సడలడంతో తీవ్రంగా గాయపడిన గోరఖ్ నీటిలో మునిగిపోయారు. బావిలో చిరుత ఉండటంతో ఎవరూ లోపలికి దిగి ఆయన్ని కాపాడే సాహసం చేయలేకపోయారు.
చివరికి ఏం జరిగింది?
మధ్యాహ్నం 1 గంటకు అటవీ శాఖ సిబ్బంది బోనుతో అక్కడికి చేరుకున్నారు. బావిలోకి బోనును దించి చిరుతను బంధించారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గోరఖ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే, బోను పదే పదే నీటిలో మునగడం వల్ల చిరుత ముక్కు, నోట్లోకి నీరు చేరి అది కూడా చనిపోయింది. బోనును బయటకు తీసేసరికి చిరుత ప్రాణాలు పోయాయి.
ఈ ఘటనతో శివడే గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
