ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వరుసగా ఘోరమైన తప్పులు చేస్తూ పోయింది జ్యోతి. ఆమె చేసిన అమానుషమైన పని చూసి ధర్మపురి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భర్త, కూతురు అనే బంధాలను కూడా ఆమె మర్చిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆరుముగం అదృశ్యం:తమిళనాడు ధర్మపురి సమీపంలోని ఎరంగట్టు కొట్టాయ్ ప్రాంతానికి చెందిన ఆరుముగం (47) ఒక మెడికల్ షాపులో పనిచేసేవాడు. ఆయన భార్య పేరు జ్యోతి (45). వీరికి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన మెడికల్ షాపుకు వెళ్లిన ఆరుముగం తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో, భార్య జ్యోతి ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సరస్సులో శవం: పోలీసులు గాలిస్తుండగా, మతికోన్పాళ్యం సమీపంలోని దూతరైయాన్ సరస్సులో ఒక పురుషుడి శవం తేలుతున్నట్లు సమాచారం అందింది. పోలీసులు వెళ్లి చూడగా అది ఆరుముగం అని తేలింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆయన తల మీద బలమైన గాయాలు ఉన్నాయని, హత్య చేసి సరస్సులో పడేశారని తేలింది.
వెలుగులోకి విస్తుపోయే నిజాలు: పోలీసుల విచారణలో జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చి వారి స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. జ్యోతికి ఆమె వరుసకు అల్లుడైన సీతారామన్ (33) అనే ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి సీతారామన్ భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ జ్యోతి, సీతారామన్ తమ బంధాన్ని కొనసాగించారు. ఒక దశలో సీతారామన్ “నీ పెద్ద కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయి” అని జ్యోతిని ఒత్తిడి చేశాడు.
కూతురి జీవితంతో ఆటలాడి..: ప్రియుడి మాట కాదనలేక, జ్యోతి తన పెద్ద కూతురిని బలవంతం చేసి 6 నెలల క్రితం సీతారామన్‌కు ఇచ్చి పెళ్లి చేసింది. ఈ పెళ్లి ఆరుముగంకు మరియు ఆయన కూతురికి అస్సలు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత కూడా జ్యోతి, సీతారామన్ అక్రమ సంబంధం కొనసాగింది. ఈ విషయం ఆరుముగంకు తెలిసి భార్యను గట్టిగా మందలించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ఆరుముగంను వదిలించుకోవాలని జ్యోతి పథకం వేసింది.
హత్య చేసిన తీరు: ఈ నెల 7వ తేదీన జ్యోతి, సీతారామన్ మరియు అతని స్నేహితులు (శరవణన్, జయశంకర్, ప్రవీణ్ కుమార్, మురుగన్) కలిసి ఆరుముగంను కిడ్నాప్ చేశారు. అక్కడ రాళ్లతో దాడి చేసి ఆయన స్పృహ తప్పి పడిపోగానే, ప్రాణాలతో ఉండగానే దూతరైయాన్ సరస్సులో పడేశారు. పోలీసులు జ్యోతి సహా మొత్తం 6 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
