బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బ్రాక్ యూనివర్సిటీలో సాంకేతిక లోపం కారణంగా ఒక ఎస్కలేటర్ ఒక్కసారిగా అత్యంత వేగంగా కదలడం విద్యార్థులలో తీవ్ర భయాందోళనలను కలిగించింది.
యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు ఎప్పటిలాగే ఎస్కలేటర్‌ను ఉపయోగిస్తుండగా, ఊహించని విధంగా దాని వేగం అనేక రెట్లు పెరిగింది. దీంతో దానిపై ఉన్న విద్యార్థులు కింద పడిపోయే పరిస్థితి ఏర్పడటంతో, ఒకరినొకరు పట్టుకుని, హ్యాండ్రైల్స్ను గట్టిగా పట్టుకుని తమ్మ తాము రక్షించుకున్నారు. ఎస్కలేటర్ కిందికి రాగానే విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకుంటున్న దృశ్యాలు చూపరులను కలవరపెడుతున్నాయి.
సుమారు 17 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుని వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే, యూనివర్సిటీలోని మౌలిక సదుపాయాల భద్రతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన యూనివర్సిటీ యాజమాన్యం, ఎస్కలేటర్‌ను తక్షణమే మూసివేసి దాని సాంకేతిక లోపాలను సరిచేయాలని ఆదేశించింది. గతంలో ఇటలీ వంటి దేశాల్లో కూడా ఇటువంటి ఎస్కలేటర్ ప్రమాదాలు జరిగిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోని యంత్రాలను ఎప్పటికప్పుడు సరైన రీతిలో నిర్వహించడం (Maintenance) ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
