“మేడమ్ రాత్రిపూట తన గదికి పిలిపించుకుంటారు..” ఉపాధ్యాయురాలిపై విద్యార్థినుల సంచలన ఆరోపణలు!

చందౌలీ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక ఉపాధ్యాయురాలి తీరుపై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు ఉపాధ్యాయురాలు తమను శారీరకంగా హింసించడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖలో కలకలం రేగింది. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ఉపాధ్యాయురాలు రాత్రి సమయాల్లో తమను తన గదికి పిలిపించుకుని, బలవంతంగా తల పట్టించుకుంటారని (Head Massage) ఆరోపించారు. అందుకు నిరాకరిస్తే చెప్పుతో కొడతానని బెదిరిస్తున్నారని వారు తెలిపారు.

అంతేకాకుండా, విద్యార్థినులతో నీళ్లు మోయించడం సహా ఆమె తన సొంత పనులన్నీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. చదువుకునే సమయంలో కూడా ఆ ఉపాధ్యాయురాలు తమను కించపరుస్తూ మాట్లాడుతున్నారని, దీనివల్ల తాము తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని విద్యార్థినులు చెప్పారు. ఒక విద్యార్థిని మాట్లాడుతూ.. “మేడమ్ మమ్మల్ని రాత్రిపూట పిలిపించి తల నొక్కమని అడుగుతారు. మేము వద్దంటే కొడతానని బెదిరిస్తారు. మేము చాలా భయపడిపోతున్నాము, సరిగ్గా చదువుకోలేకపోతున్నాము” అని ఆవేదన వ్యక్తం చేసింది.

వార్డెన్ సైతం స్పందిస్తూ.. “ఉపాధ్యాయురాలి ప్రవర్తన గురించి నాకు కూడా చాలాసార్లు ఫిర్యాదులు అందాయి. విద్యార్థినులతో ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము” అని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు, జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని సదరు ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Posted

in

by

Tags: