‘మేము పాకిస్తాన్ లాంటి ‘దళారీ’ దేశం కాదు’ — అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ ఇలా ఎందుకు అన్నారు?

న్యూ ఢిల్లీ: పశ్చిమ ఆసియా పరిస్థితులపై బుధవారం జరిగిన సర్వపక్ష సమావేశం ముగిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు.

సమావేశం సందర్భంగా ప్రభుత్వం అన్ని పార్టీలకు కీలక సమాచారం అందించింది. దేశంలో ఇంధన కొరత ఏమీ లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయంగా LPG ఉత్పత్తి 60% వరకు పెరిగిందని తెలిపింది.

ఇరాన్ యుద్ధం – భారతీయుల భద్రత

ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకల గురించి జైశంకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 4 నౌకలు చేరుకున్నాయని, మరికొన్ని రానున్నాయని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం రాయబార కార్యాలయాలు నిరంతరం పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు 4.25 లక్షల మందిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చామని ప్రభుత్వం వెల్లడించింది.

‘దళారీ దేశం’ వ్యాఖ్య ఎందుకు?

సమావేశంలో ధర్మేంద్ర యాదవ్ మరియు ముకుల్ వాస్నిక్ వంటి నేతలు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ పోషిస్తున్న మధ్యవర్తిత్వ పాత్ర గురించి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ.. పాకిస్థాన్ ఇలాంటి పనులు 1981 నుండి చేస్తూనే ఉందని, ఇందులో కొత్తేమీ లేదని పేర్కొంది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందిస్తూ.. “మనం పాకిస్థాన్ లాగా ‘దళారీ దేశం’ (Dalal Nation) కాలేము” అని వ్యాఖ్యానించారు. అంటే, భారత్ తన సొంత ప్రయోజనాల కోసం దౌత్యాన్ని నడుపుతుంది తప్ప, ఇతరుల మధ్య బ్రోకర్‌గా వ్యవహరించదని ఆయన స్పష్టం చేశారు.

సమావేశంలో పాల్గొన్నవారు:

ఈ సమావేశంలో ప్రభుత్వ పక్షాన రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్, హర్దీప్ పూరి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాల్గొన్నారు. విపక్షాల నుండి సస్మిత్ పాత్ర (BJD), లలన్ సింగ్ (JDU), ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్ (Congress), ధర్మేంద్ర యాదవ్ (SP), జాన్ బ్రిట్టాస్ (CPM) మరియు అసదుద్దీన్ ఒవైసీ (AIMIM) హాజరయ్యారు.

రాజకీయ విమర్శలు – ప్రతి విమర్శలు

ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ‘చాలా ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం’ అని విమర్శించింది. ఇంతటి కీలక చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించింది. గతంలో పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులు ఇలాంటి సమావేశాలకు స్వయంగా హాజరయ్యేవారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ గుర్తు చేశారు.

మరోవైపు, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ.. ఇరాన్ పట్ల ప్రభుత్వ తీరు వల్ల దేశంలోనే సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.


Posted

in

by

Tags: