16 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్న 28 ఏళ్ల వ్యక్తిపై పోక్సో (POCSO), భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల కింద నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
ముస్లిం పర్సనల్ లా (Muslim Personal Law) ప్రకారం ఇరు కుటుంబాల అంగీకారంతోనే తమకు వివాహం జరిగిందని, బాలిక రజస్వల (యుక్తవయసుకు రావడం) అయినందున ఈ వివాహం చెల్లుబాటు అవుతుందని పేర్కొంటూ.. కేసును రద్దు చేయాలని కోరుతూ ఆ దంపతులు కోర్టును ఆశ్రయించారు.
అయితే, ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజీవ్ నరులా.. “కేవలం వివాహం చేసుకున్నంత మాత్రాన మైనర్ బాలిక వయసు పెరిగిపోదు. దేశంలోని క్రిమినల్ చట్టాల నుంచి వ్యక్తిగత చట్టాలు (Personal Laws) మినహాయింపు ఇవ్వలేవు” అని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేశారు.
ఆ బాలిక ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు చికిత్స కోసం ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, ఆమెకు కేవలం 16 ఏళ్లు మాత్రమేనన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
18 ఏళ్లలోపు బాలికలతో శారీరక సంబంధం పెట్టుకోవడం పోక్సో, బీఎన్ఎస్ చట్టాల ప్రకారం నేరమని గుర్తుచేసిన న్యాయస్థానం.. బాలల రక్షణ చట్టాలు వ్యక్తిగత చట్టాల కంటే ఉన్నతమైనవని, నిందితుడు కచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది.

Leave a Reply