న్యూఢిల్లీ: గత 16 ఏళ్లుగా విడిపోయి ఉంటున్న భార్యకు విడాకులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒక 54 ఏళ్ల వ్యక్తికి అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. భార్యకు నెలకు చెల్లిస్తున్న రూ. 15,000 భరణాన్ని భారం అని పేర్కొనడంపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ.. నేటి కాలంలో ఆ మొత్తం చాలా స్వల్పమని తేల్చి చెప్పింది.
“ప్రశాంతంగా ఉండండి.. డబ్బులు కట్టండి!”
జస్టిస్ విక్రమ్ నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. “నేటి రోజుల్లో రూ. 15,000 అంటే ఏమీ రాదు. ఒకవేళ మీరు విడాకులు కావాలని కోరుకుంటే, శాశ్వత భరణం (Permanent Alimony) కింద తగిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడండి. లేని పక్షంలో.. శాంతిగా కూర్చోండి, ఆ 15 వేలు కడుతూ ఉండండి, సంతోషంగా ఉండండి” (Shaanti se baitho, dete raho Rs 15,000, khush raho) అని వ్యాఖ్యానించింది.
కేసు నేపథ్యం:
- ఆదాయం vs భరణం: పిటిషనర్ తన నెలసరి ఆదాయం రూ. 65,000 అని, అందులో రూ. 15,000 భరణం కట్టడం తనకు పెను భారంగా మారిందని వాదించారు. కానీ, ప్రస్తుత జీవన ప్రమాణాల దృష్ట్యా ఇది పెద్ద మొత్తమేమీ కాదని కోర్టు కొట్టిపారేసింది.
- 16 ఏళ్ల వియోగం: గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా దంపతులు విడివిడిగానే ఉంటున్నారు. మనస్పర్థల కారణంగానే తాను భార్యతో కలిసి ఉండలేనని సదరు వ్యక్తి కోర్టుకు తెలిపాడు.
- భార్య మొగ్గు: అయితే భార్య తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమెకు భరణం కంటే తన భర్తతో కలిసి జీవించడమే ఇష్టమని, తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వారికి సంతానం లేదని, ప్రస్తుతం ఆమె తన తల్లి వద్ద ఉంటున్నారని తెలిపారు.
“మీ భార్యను మీతోనే ఉంచుకోండి, అసలు సమస్య ఏమిటి?” అని ఈ సందర్భంగా కోర్టు నిలదీసింది. ఒకవేళ విడాకులు తప్పనిసరి అనుకుంటే, ఆమె భవిష్యత్తు కోసం గౌరవప్రదమైన సెటిల్మెంట్ ఆఫర్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
