టెహ్రాన్: అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు జరిపిన ఖచ్చితమైన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన కుమారుడు మరియు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఇరాన్ మిత్రదేశమైన రష్యాలో రహస్యంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మాస్కోలో రహస్య చికిత్స? మొజ్తబా ఖమేనీని కూడా అంతం చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన చికిత్స పొందుతున్న ప్రదేశంపై అత్యంత గోప్యత పాటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు మొజ్తబాను మాస్కోలోని ఒక రహస్య ప్రాంతానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇరాన్ రష్యాకు డ్రోన్ టెక్నాలజీని అందించగా, ఇప్పుడు దానికి ప్రతిఫలంగా మొజ్తబాను కాపాడే బాధ్యతను పుతిన్ తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
వార్తలను ధృవీకరించిన వార్తా సంస్థ: కువైట్కు చెందిన ‘అల్-జరీదా’ పత్రిక కథనం ప్రకారం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడుకున్నారని, ఆ సమయంలోనే మొజ్తబాకు రష్యాలో చికిత్స అందించే ప్రతిపాదన వచ్చిందని తెలిపింది. ఈ మేరకు మార్చి 12న మొజ్తబాను ఒక రష్యా సైనిక విమానంలో మాస్కోకు తరలించినట్లు పేర్కొంది.
రష్యా ఏమంటోంది?: ఈ వార్తలపై రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ను ప్రశ్నించగా.. “మేము ఇలాంటి విషయాలపై ఎప్పుడూ స్పందించము” అని ఒకే మాటలో ముగించారు. దీనిని రష్యా అటు ధృవీకరించలేదు, ఇటు ఖండించలేదు. దీంతో మొజ్తబా మాస్కోలోనే ఉన్నారనే వాదనలకు బలం చేకూరుతోంది.
మొజ్తబా ఆరోగ్య పరిస్థితి ఏమిటి? మొజ్తబా గాయాల గురించి భిన్నమైన వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడిలో అలీ ఖమేనీ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకారం మొజ్తబా కాలు, చేయి మరియు మణికట్టుకు గాయాలయ్యాయని, ఆయన క్షేమంగానే ఉన్నారని తెలిపారు. అయితే, బ్రిటీష్ వార్తాపత్రిక ‘ది సన్’ కథనం ప్రకారం.. మొజ్తబా కాలుకు తీవ్రమైన గాయమైందని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా “ఇరాన్ కొత్త నాయకుడు అసలు బతికే ఉన్నాడో లేదో నాకు తెలియదు” అని వ్యాఖ్యానించడం గమనార్హం.
