ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇది ఒకవైపు సౌకర్యవంతంగా ఉన్నా, మరోవైపు అంతే ప్రమాదకరంగా మారుతోంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన ‘స్మార్ట్ గ్లాసెస్’ (Smart Glasses) సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
చేతులతో బటన్ నొక్కాల్సిన అవసరం లేకుండా, కేవలం వాయిస్ కమాండ్‌తో ఫోటోలు తీయడానికి, వీడియోలు రికార్డ్ చేయడానికి ఈ గ్లాసెస్‌ను తయారు చేశారు. అయితే, ఇవే ఇప్పుడు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు, గౌరవానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. కొంతమంది వీటిని స్టైల్ కోసం వాడుతుంటే, మరికొందరు దురుద్దేశంతో ఉపయోగిస్తున్నారు.
తెలియకుండానే వీడియో రికార్డింగ్: ముఖ్యంగా “పిక్-అప్ ఆర్టిస్ట్స్” అని పిలుచుకునే కొందరు వ్యక్తులు, మహిళలతో మాట్లాడేటప్పుడు వారికి తెలియకుండానే ఆ సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేస్తున్నారు. బస్టాపులు, బీచ్‌లు, రోడ్లు మరియు షాపింగ్ మాల్స్‌లో మహిళలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్లు, హ్యాష్‌ట్యాగ్‌లతో వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.
విదేశాల్లో చేదు అనుభవాలు:
- ఇంగ్లాండ్: గత నెలలో ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఒక వ్యక్తి ఆమెకు తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు తీసి, తిరిగి ఆమెకే పంపాడు. ఆమె కోర్టును ఆశ్రయించినప్పటికీ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
- అమెరికా: సూపర్ మార్కెట్లో ఒక వ్యక్తి ఒక మహిళను పొగిడి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తన అనుమతి లేకుండా రికార్డ్ చేశారని తెలుసుకున్న ఆ మహిళ కన్నీరుమున్నీరైంది.
మొబైల్ కంటే ప్రమాదకరం: సాధారణంగా మొబైల్ ఫోన్‌తో వీడియో తీస్తే కెమెరా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ స్మార్ట్ గ్లాసెస్‌లో కెమెరా కళ్లద్దాల్లోనే దాగి ఉంటుంది. ఎవరు వీడియో తీస్తున్నారో గుర్తించడం చాలా కష్టం.
భారత్‌లో చట్టాల పరిస్థితి: భారతదేశంలో స్మార్ట్ గ్లాసెస్ వాడకంపై ప్రస్తుతం నిర్దిష్టమైన చట్టాలేవీ లేవు. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’ కూడా బహిరంగ ప్రదేశాల్లో వీడియో తీసేటప్పుడు ఇతరులకు చెప్పాలని నిబంధన విధించలేదు. అంటే మెట్రో, పార్కులు లేదా కేఫ్‌లలో ఎవరైనా మీకు తెలియకుండా ఫోటోలు తీసే అవకాశం ఉంది. అందుకే మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి. స్మార్ట్ గ్లాసెస్ ఎలా ఉంటాయో, వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం.
