న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా తొమ్మిది దేశాల మీదుగా విమానాలు ప్రయాణించకుండా చూడాలని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల గగనతలాలను ఉపయోగించవద్దని కోరింది. ఈ దేశాలకు సర్వీసులు నడుపుతున్న లేదా వీటి మీదుగా ప్రయాణించే విమానయాన సంస్థలు ఖచ్చితమైన భద్రతా జాగ్రత్తలు పాటించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను (Alternative plans) సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.
ముఖ్యంగా ఈ దేశాల మీదుగా 32,000 అడుగుల కంటే తక్కువ ఎత్తులో విమానాలు ప్రయాణించకూడదని కఠినమైన నిబంధన విధించింది. సైనిక చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లో పౌర విమానాలను శత్రు విమానాలుగా పొరబడే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఆదేశాలు మార్చి 28 వరకు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని DGCA తెలిపింది.
