యూరప్‌లో వడగాల్పుల ధాటికి బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో రోడ్లు కరిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్‌లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు 45°C నుండి 48°C వరకు చేరుతుంటాయి. అయినా ఇక్కడ రోడ్లు ఎందుకు కరగవు? యూరప్ రోడ్ల నాణ్యత తక్కువనా? అంటే కానే కాదు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఆయా దేశాల వాతావరణానికి తగ్గట్టుగా రోడ్లను నిర్మించే ‘ఇంజనీరింగ్ టెక్నాలజీ’.
యూరప్‌లో రోడ్లు ఎందుకు కరుగుతున్నాయి? యూరప్, యూకే దేశాల్లోని రోడ్లను తీవ్రమైన చలి, మంచును తట్టుకునేలా డిజైన్ చేస్తారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువకు పడిపోయినప్పుడు రోడ్లు పగుళ్లు రాకుండా ఉండేందుకు అక్కడ ‘సాఫ్ట్ బిట్యూమెన్’ (మెత్తని తారు) ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుతం అక్కడ అకస్మాత్తుగా ఏర్పడిన హీట్‌వేవ్ (వడగాల్పులు) వల్ల ఈ సాఫ్ట్ బిట్యూమెన్ కరిగిపోతోంది.
భారతదేశంలో రోడ్లు ఎందుకు కరగవు? భారతదేశ వాతావరణం యూరప్‌కు భిన్నం. ఇక్కడ అతిపెద్ద సవాలు చలి కాదు, తీవ్రమైన ఎండలు. అందుకే భారతీయ రోడ్లను ‘హీట్ రెసిస్టెంట్’ (వేడిని తట్టుకునేలా) నిర్మిస్తారు.
- హార్డర్ VG-గ్రేడ్ బిట్యూమెన్: భారతీయ రోడ్ల నిర్మాణంలో చాలా గాఢత కలిగిన, గట్టిగా ఉండే ‘VG-30’, ‘VG-40’ గ్రేడ్ తారును ఉపయోగిస్తారు.
- మెటీరియల్ మిశ్రమం: రోడ్ల నిర్మాణంలో పెద్ద రాళ్లు, గ్రిట్‌ను ఉపయోగిస్తారు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా రోడ్లు బలహీనపడకుండా చూస్తుంది.
- హై విస్కాసిటీ: భారతీయ తారు యొక్క గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే 45°C దాటిన ఎండల్లో, భారీ వాహనాలు తిరిగినా రోడ్లు కరగవు లేదా గుంతలు పడవు.
క్లుప్తంగా చెప్పాలంటే, యూరప్ రోడ్లు చలికి అనుగుణంగా ఉండగా, భారతీయ రోడ్లు ఎండకు అనుగుణంగా తయారవుతాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్న అనూహ్య వాతావరణ మార్పులే యూరప్ రోడ్ల ప్రస్తుత దుస్థితికి కారణం.
