కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఊహించని రీతిలో ఫ్రిజ్ ఒక్కసారిగా పేలిపోవడంతో, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
రాత్రి వేళ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలడంతో చెలరేగిన భారీ మంటలు, దట్టమైన పొగలో చిక్కుకుని వారు సజీవ దహనమయ్యారు.
ఈ విషాద ఘటనలో గజానన్ దామోన్ (65), రోషన్ దామోన్ (21), శారదా దామోన్ (45), భారతి దామోన్ (50) మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
అలాగే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియా (28), గంగ (25)లను సహాయక సిబ్బంది రక్షించి, ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగం (ICU)లో చేర్పించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్కు అకస్మాత్తుగా హై వోల్టేజ్ సరఫరా కావడమే ఈ పేలుడుకు కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులను సరైన పద్ధతిలో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.
